ప్రాణాలు తినేస్తున్న శిలాజ ఇంధనాలు !

ప్రాణాలు తినేస్తున్న శిలాజ ఇంధనాలు !

వాతావరణ మార్పు అనేది మన వర్తమానాన్ని కబళిస్తున్న పెను విపత్తు అని, 'ప్రజారోగ్య సంక్షోభం' అని ప్రఖ్యాత 'లాన్సెట్ కౌంట్‌డౌన్' తాజా నివేదిక కుండబద్దలు కొట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించినట్లుగా, ‘వాతావరణ సంక్షోభమే ఆరోగ్య సంక్షోభం’. ఈ మాటలకు లాన్సెట్ నివేదికలోని గణాంకాలు బలమైన సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 1990ల నాటితో పోలిస్తే, అధిక వేడి (వడదెబ్బ) కారణంగా సంభవిస్తున్న మరణాలు 63% పెరిగాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 2012-–21 మధ్య ఏటా సగటున 5,46,000 మంది కేవలం వేడి తాపానికి బలైపోవడం అనేది ఆధునిక సమాజంలో  జరుగుతోంది. 2024లో అధిక వేడి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 640 బిలియన్ల పని గంటలు వృథా అయ్యాయి. దీనివల్ల వాటిల్లిన ఉత్పాదకత నష్టం అక్షరాలా 1.09 ట్రిలియన్ డాలర్లు. 

ఇది కేవలం ఆర్థిక నష్టం కాదు, ఇది కోట్ల మంది కార్మికుల జీవనోపాధిపై పడిన దెబ్బ. 2024లో 61% భూభాగం తీవ్ర కరువు బారిన పడటం (1950ల సగటు కంటే 299% అధికం) ప్రపంచ ఆహార భద్రతా వ్యవస్థల పునాదులను కదిలిస్తోంది. కరువు అంటే పంట నష్టం, పశువుల మరణం, అంతిమంగా ఆకలి కేకలు. కాలుష్యం, అంటువ్యాధులు: కార్చిచ్చుల వల్ల వెలువడిన కాలుష్యంతో 1,54,000 మంది మరణించడం, గాలి నాణ్యత ఎంతగా పడిపోయిందో చెబుతోంది. మరోవైపు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు డెంగ్యూ వంటి అంటువ్యాధులు వ్యాప్తి చెందడానికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ ప్రభావం అందరిపై ఒకేలా ఉండదు. వాతావరణ మార్పుల భారాన్ని పేద దేశాలు, అణగారిన వర్గాలు, వృద్ధులు, పిల్లలు ఎక్కువగా మోయవలసి వస్తుందన్నది కాదనలేని సత్యం.

కార్పొరేట్ లాభాలకే !
వాతావరణ మార్పుల వల్ల ఏటా లక్షల మంది చనిపోతుంటే, మరోవైపు, అవే ప్రభుత్వాలు ఈ సంక్షోభానికి మూలకారణమైన శిలాజ ఇంధనాలకు అండగా నిలబడుతున్నాయి. 2023లో ప్రపంచ ప్రభుత్వాలు ఏకంగా 956 బిలియన్ డాలర్లను శిలాజ ఇంధన సబ్సిడీల రూపంలో ధారపోశాయి. మరింత దారుణంగా 15 దేశాలు తమ మొత్తం ఆరోగ్య బడ్జెట్ కంటే ఎక్కువగా ఈ సబ్సిడీలకే కేటాయించడం అంటే,  ప్రజల ప్రాణాల కంటే కార్పొరేట్ లాభాలకే పెద్ద పీట వేస్తున్నాయని స్పష్టమవుతోంది.

కాలుష్య ఇంధనాలకు సబ్సిడీలా?
* ఆరోగ్యాన్ని కాపాడటానికి బడ్జెట్లు లేవంటూనే, అనారోగ్యానికి కారణమవుతున్న పరిశ్రమలకు ప్రజాధనాన్ని పంచడం ఎలాంటి విజ్ఞత? ఈ సబ్సిడీలు లేకపోతే, శిలాజ ఇంధనాల వాడకం తగ్గి, పునరుత్పాదక ఇంధనాల వైపు ప్రపంచం వేగంగా అడుగులు వేసి ఉండేది.

* శిలాజ ఇంధనాలకు ఇస్తున్న వందల బిలియన్ డాలర్ల సబ్సిడీలను తక్షణమే రద్దు చేయాలి. ఆ నిధులను పునరుత్పాదక ఇంధన వనరులు, ప్రజారోగ్య వ్యవస్థల బలోపేతానికి మళ్లించాలి.  సౌర, పవన విద్యుత్ వంటి స్వచ్ఛమైన ఇంధన వనరులలో పెట్టుబడులను యుద్ధప్రాతిపదికన పెంచాలి.

* డాక్టర్ మెరీనా రోమనెల్లో చెప్పినట్లు, శిలాజ ఇంధనాల వాడకాన్ని వేగంగా తగ్గిస్తే, కాలుష్యం తగ్గి ఏటా కోటి మంది ప్రాణాలను కాపాడవచ్చు. శిలాజ ఇంధనాలకు సబ్సిడీలు ఇచ్చి మరణాన్ని కొనితెచ్చుకుందామా? లేక, ఆ డబ్బును ఆరోగ్యానికి, స్వచ్ఛమైన ఇంధనానికి మళ్లించి మన భవిష్యత్ తరాలకు జీవించగలిగే ప్రపంచాన్ని అందిద్దామా? నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వాలే, కానీ ఆ నిర్ణయం కోసం ఒత్తిడి తేవాల్సింది ప్రజలమే.

సిద్ధగౌని సుద‌ర్శన్