కింగ్ మేకర్ కాదు.. కింగ్ అవుతాం.. టీడీపీ, జనసేన మా కోసం ప్రచారం చేస్తున్నయ్: కిషన్ రెడ్డి

కింగ్ మేకర్ కాదు.. కింగ్ అవుతాం.. టీడీపీ, జనసేన మా కోసం ప్రచారం చేస్తున్నయ్: కిషన్ రెడ్డి
  • రెండేండ్లు బయటికిరాని కేసీఆర్.. సీఎం ఎట్లయితడు?
  • కేటీఆర్ పగటి కలలు కంటున్నడు
  • తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని వ్యాఖ్య
  • మీడియాతో కేంద్ర మంత్రి చిట్​చాట్
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేది మేమే: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాము కింగ్ మేకర్ కాదని.. కింగ్ అవుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బై ఎలక్షన్​లో త్రిముఖ పోటీ ఉందని, అది తమకే కలిసి వస్తదని తెలిపారు. ఎన్డీయే కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన కార్యకర్తలు, సానుభూతిపరులు తమ కోసం ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో సోమవారం కిషన్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘‘కొన్ని ఫేక్ సర్వేలు వస్తున్నయ్. వాటిని బెడ్ రూములో ఉండి చేశారో.. బాత్ రూములో ఉండి చేశారో ఎవరికీ తెల్వదు. మేము ఈ సర్వేలను నమ్ముకోం. ఇంటింటి ప్రచారాన్ని మాత్రమే నమ్ముకుంటం. ఓ సామాజిక వర్గం ఓట్ల కోసమే అజారుద్దీన్​కు మంత్రి పదవి ఇచ్చారే తప్ప.. వాళ్లపై ప్రేమతో కాదు” అని అన్నారు.


కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్‌‌ఎస్‌‌కు మధ్య ఒప్పందం కుదిరింది. అందుకే బీఆర్ఎస్ నేతలెవ్వరినీ అరెస్టు చేయడం లేదు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి బీఆర్‌‌ఎస్, కాంగ్రెస్ తూట్లు పొడిచాయి. ఈ విషయంలో రెండు పార్టీలు తోడు దొంగలు’’ అని విమర్శించారు. బీఆర్‌‌ఎస్ అధికారం కోల్పోయాక కేసీఆర్ ఎక్కడా ప్రజల్లో కనిపించడం లేదని, తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్ లేదని విమర్శించారు. ఆ పార్టీ నేత కేటీఆర్ మాత్రం 500 రోజుల్లో మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారంటూ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రెండేండ్ల నుంచి బయటకు రాని కేసీఆర్.. సీఎం ఎలా అవుతారని ప్రశ్నించారు. 

కాలేజీల బంద్కు మద్దతు
ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలంటే విజిలెన్స్ పేరిట కాలేజీ మేనేజ్​మెంట్లను రాష్ట్ర సర్కారు బెదిరిస్తున్నది కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘‘బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి చెల్లించకపోవడంతోనే కాలేజీ యాజమాన్యాలు సమ్మె బాటపట్టాయి. కాలేజీల బంద్​కు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తది. ప్రభుత్వ అనాలోచిత వైఖరితో నష్టపోయేది యాజమాన్యాలు కాదు.. విద్యార్థులు, సిబ్బంది. నిజంగానే నిబంధనలు పాటించని కాలేజీలకు అడ్మిషన్లు నిలిపివేయాలి. వాళ్లపై చర్యలు తీసుకోవాలి. అంతేగానీ.. ఫీజు రీయింబర్స్​మెంట్ అడిగితే విజిలెన్స్ దాడుల పేరిట భయపెట్టడం ఎందుకు?’’అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు అమలవ్వాలంటే 9వ షెడ్యూల్ లో చేర్చాలని, ఎన్నో ఏండ్లు పాలించిన కాంగ్రెస్.. అప్పుడు ఎందుకు చేర్చలేదని నిలదీశారు. కాళేశ్వరం విచారణ అంశం కోర్టులో ఉందని, అయితే, ప్రభుత్వం కేవలం ఒక మేడిగడ్డపైనే సీబీఐ విచారణ కోరిందని గుర్తుచేశారు. 

అది డాడీ.. డాటర్ ఇష్యూ...
కల్వకుంట్ల ఫ్యామిలీలో ఆస్తులు, పదవుల కొట్లాట జరుగుతున్నదని కిషన్ రెడ్డి ఆరోపించారు. అందుకే కవిత బయటికొచ్చిందని విమర్శించారు. కవితకు తమ పార్టీకి ఏం సంబంధం లేదని, అది డాడీ, డాటర్ ఇష్యూ అని, వాళ్లే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. ‘‘కవిత ఎవరిని తిట్టాలని.. ఎవరిని తిడుతున్నదో వారికే తెలియాలి. వారి గురించి కామెంట్స్ చేసి కూడా వేస్ట్. తెలంగాణ రాజకీయాలను కవిత ఇష్యూ ప్రభావితం చేయదు. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పూర్తి స్థాయిలో పని చేస్తున్నాం. నా ప్రచార షెడ్యూల్ కూడా పార్టీయే నిర్ణయిస్తది. పార్టీ కీలక నేతలంతా త్వరలోనే ప్రచారంలో పాల్గొంటారు. బిహార్ ఎన్నికల్లో గెలిచేది మేమే. మళ్లీ ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. బీజేపీలోకి రావాలనుకుంటే.. ముందు పదవికి రాజీనామా చేయాలి. ఖైరతాబాద్ సెగ్మెంట్​కు ఉప ఎన్నిక రావాలని కోరుకుంటున్న. సీఎం రేవంత్ రెడ్డి సినీ కార్మికులతో మీటింగ్ పెట్టినంత మాత్రానా వాళ్లు ఓట్లేయరు. వారి ఇండ్లు కూల్చి, హీరోలను జైళ్లో పెట్టారు. సినీ ఇండ్రస్టీలోని అందరినీ మేము కలుస్తాం’’అని కిషన్ రెడ్డి అన్నారు.

ఆ మూడూ కుటుంబ పార్టీలే: కిషన్ రెడ్డి
జూబ్లీహిల్స్, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ మూడూ కుటుంబ పార్టీలేనని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో మహార్యాలీ నిర్వహించారు. వెంగళరావు నగర్ నాగార్జున కాలనీలో నుంచి మోతినగర్, బోరబండ, రహమత్ నగర్, యూసఫ్ గూడ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ, గణపతి కాంప్లెక్స్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కిషన్​రెడ్డి మాట్లాడారు. పదేండ్లు బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ అదే పనిచేస్తున్నదన్నారు.