వినుకొండలో వైసీపీ, టీడీపీ ఘర్షణ.. పోలీస్ కాల్పులు..

వినుకొండలో వైసీపీ, టీడీపీ ఘర్షణ.. పోలీస్ కాల్పులు..

ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. నువ్వా నేనా అన్నట్లు వీధుల్లో కొట్లాటలకు దిగుతున్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ -.. టీడీపీ కార్యకర్తలు. పల్నాడు జిల్లా వినుకొండలో రెండు వర్గాల మధ్య ప్రధాన సెంటర్ లో జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పోటాపోటీ నిదానాలు, అరుపులతో రణరంగం అయ్యింది. కర్రలతో దాడులకు దిగారు. పరిస్థితి చేయిదాటి పోవటంతో.. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులను చెదరగొట్టారు.

2023, జులై 27వ తేదీ గురువారం మధ్యాహ్నం టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టింది. అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు వినుకొండ పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఇదే సమయంలో.. వైసీపీ కార్యకర్తలు కూడా రోడ్డెక్కారు. టీడీపీకి పోటీగా వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. రెండు వర్గాలు వినుకొండ పట్టణంలో ఎదురెదురు పడ్డాయి. వాగ్వాదం జరిగింది.

ఇదే సమయంలో వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే పల్నాటి బ్రహ్మనాయుడు వైసీపీ కార్యకర్తల ర్యాలీ దగ్గరకు చేరుకున్నారు. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిని చూసిన టీడీపీ కార్యకర్తలు.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బ్రహ్మనాయుడికు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తల నినాదాలు విన్న పల్నాటి బ్రహ్మనాయుడు.. కారులో నుంచి బయటకు దిగి.. టీడీపీని సవాల్ చేస్తూ తొడకొట్టారు.

బ్రహ్మనాయుడు తొడ కట్టటాన్ని చూసిన టీడీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. వైసీపీ వాళ్లపై రాళ్లు విసిరారు. కర్రలతో దాడికి దిగారు టీడీపీ కార్యకర్తలు. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిపై రాళ్ల దాడి జరగటంతో షాక్ అయిన వైసీపీ వర్గీయులు.. పోటీగా రాళ్ల దాడికి దిగారు. కర్రలతో ఎగబడ్డారు. రెండు వర్గాలు నడిరోడ్డుపై రాళ్లు, కర్రలతో.. అక్కడ బీభత్స వాతావరణం నెలకొంది. 

పరిస్థితి శాంతియుతంగా అదుపు చేసే అవకాశాలు లేకపోవటం.. మరింతగా ఉద్రిక్తత నెలకొనే ప్రమాదం ఉండటంతో.. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. లాఠీలతో ఆందోళనకారులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిని అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతం వినుకొండలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రధాన సెంటర్ లో దుకాణాలు మూయించారు పోలీసులు. రాళ్ల దాడిలో వైసీసీ, టీడీపీ వర్గాలకు చెందిన 200 మంది వరకు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.