
రాష్ట్రంలో రానున్న మూడ్రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆది, సోమవారాల్లో ఆరెంజ్ అలర్ట్ (భారీ నుంచి అతి భారీ వర్షాలు) జారీ చేసినట్లు పేర్కొంది. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. సోమవారం బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడవచ్చని చెప్పింది. శనివారం రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ములుగులోని వెంకటాపురంలో 11 సెంటీమీటర్లు, సిద్దిపేటలోని కొండపాక, తిమ్మారెడ్డిపల్లిలో 10.8, నారాయణపేటలో 10.4, మునిగడపలో 10.1, నల్గొండలోని పుల్లెంలలో 8.6 సెం.మీ. చొప్పున వర్షపాతం రికార్డయ్యింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 30 శాతం ఎక్కువగా వర్షాలు పడ్డాయి.