
- రెండు, మూడు రోజుల్లో ప్రకటించే చాన్స్
- ఫైవ్ మెన్ కమిటీ ఒపీనియన్ తీసుకున్న హైకమాండ్
- నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్, 20 నుంచి 25 వరకు వైస్ప్రెసిడెంట్స్ నియామకం
హైదరాబాద్, వెలుగు: పీసీసీ కార్యవర్గం ప్రకటించేందుకు హై కమాండ్ దాదాపు కసరత్తు పూర్తి చేసింది. సోమవారం తర్వాత కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. కార్యవర్గంలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 20 నుంచి 25 మంది వరకు వైస్ ప్రెసిడెంట్లు మాత్రమే ఉండనున్నారు. మిగితా కార్యవర్గాన్ని డీసీసీ చీఫ్ ల నియామకంతో పాటే ప్రకటించనున్నారు. మొదటి దశ కార్యవర్గం ప్రకటన కోసం ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇప్పటికే రాష్ట్రానికి చెందిన ఫైవ్ మెన్ కమిటీ అభిప్రాయాన్ని తీసుకున్నారు. 3 రోజుల పాటు ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు వేర్వేరుగా ఢిల్లీకి వెళ్లి.. కేసీ వేణుగోపాల్ ను కలిశారు.
కార్యవర్గంలో ఎవరైతే బాగుంటుందనే దానిపై చర్చించి.. నేతల పేర్లను సూచించారు. అయితే చివరకు ఎవరనేది ఫైనల్ నిర్ణయం మాత్రం హైకమాండ్ దే. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి దీనికి సంబంధించిన జాబితాను హైకమాండ్ కు అందజేశారు. దీనిపై ఇటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయాలను హైకమాండ్ తీసుకున్నది.
వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులకు తీవ్ర పోటీ
వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ఎంపీలు, ఎమ్మెల్యేలే ఆశిస్తుండడంతో పోటీ తీవ్రంగా ఉంది. నాలుగు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు భర్తీ చేయనుండడంతో.. ఇవి ఎవరికి దక్కనున్నాయనే చర్చ గాంధీ భవన్ లో జోరుగా సాగుతున్నది. నాలుగింటిలో రెడ్డి, బీసీ మహిళా, ఎస్సీ సామాజిక వర్గాల నుంచి తీసుకోవడం ఖాయమైంది. నాలుగోది ఎస్టీకి ఇవ్వడమా? లేదా మైనార్టీకా? అనేది తేలాల్సి ఉంది.
.మొత్తానికి సోమవారం తర్వాత పీసీసీ కార్యవర్గం ప్రకటన ఖాయమనే సంకేతాలను రాష్ట్ర నేతలకు హైకమాండ్ పంపించినట్లు సమాచారం. మరోసారి పీసీసీ చీఫ్ హైకమాండ్ ను కలిసిన తర్వాతనే ప్రకటన ఉంటుందని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. దీని ప్రకారం సోమవారం మరోసారి పీసీసీ చీఫ్ ఢిల్లీకి వెళ్లే చాన్స్ కనిపిస్తున్నది.