మున్సిపల్ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ పై హైకోర్టు ఆగ్రహం

మున్సిపల్ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ పై హైకోర్టు ఆగ్రహం
  • అరెస్ట్ వారెంట్ ఇస్తేగానీ కదలరా?
  • మున్సిపల్ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ పై హైకోర్టు ఆగ్రహం
  • ఉన్నతాధికారుల తీరుపైనా మండిపాటు

హైదరాబాద్, వెలుగు: ‘‘కోర్టు ఆర్డర్‌‌ అంటే లెక్కలేదా? అంత తేలికైపోయిందా లేక చులకనగా తీసుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? అరెస్ట్ వారెంట్‌‌ ఇచ్చి జైలుకు పంపితే తెలుస్తుంది కోర్టంటే ఏమిటో. జీతాలు, సౌకర్యాలన్నీ నిలిపివేస్తేగానీ ఆఫీసర్లలో కదలిక రాదా?’’ అని రాష్ట్ర్ర ఉన్నతాధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌‌లోని హిస్టారికల్‌‌ హిల్‌‌ఫోర్ట్‌‌ పునరుద్ధరణ పనులు చేయట్లేదంటూ హెరిటేజ్‌‌ ట్రస్ట్‌‌ వేసిన పిల్‌‌ను హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ సీవీ భాస్కర్‌‌రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌ శుక్రవారం విచారించింది. గత విచారణలో ఆదేశించిన మేరకు మున్సిపల్‌‌ శాఖ స్పెషల్‌‌ చీఫ్‌‌ సెక్రటరీ అరవింద్‌‌కుమార్‌‌ హాజరుకాకపోవడంతో హైకోర్టు ఇలా ఫైర్ అయింది. అరెస్ట్‌‌ వారెంట్‌‌ జారీ చేసి జైలులో పెట్టిస్తామని హెచ్చరించింది. విచారణకు ఆర్‌‌ అండ్‌‌ బీ శాఖ కార్యదర్శి కె.ఎస్‌‌. శ్రీనివాసరావు, ఆర్థిక శాఖ కార్యదర్శి టి.కె. శ్రీదేవి, జీహెచ్‌‌ఎంసీ కమిషనర్‌‌ లోకేశ్​ కుమార్, పర్యాటక శాఖ ఎండీ బి.మనోహర్‌‌ రావు, హెచ్‌‌ఎండీఏ డైరెక్టర్‌‌ ఎస్‌‌. బాలక్రిష్ణ హాజరయ్యారు. పురపాలక శాఖ తరఫున అరవిందకుమార్‌‌ హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

గతంలో ఇంట్ల ఫంక్షన్ అని ఎగ్గొట్టిండు.. 

ఆర్కిటెక్ట్‌‌ అనురాధ నాయక్‌‌ ఆధ్వర్యంలో హిల్‌‌పోర్ట్‌‌ పనులు జరుగుతున్నాయని గవర్నమెంట్‌‌ స్పెషల్‌‌ ప్లీడర్‌‌ హరీందర్‌‌ పరిషత్‌‌ కోర్టుకు వివరణ ఇచ్చారు. సీఎంతో సమావేశం ఉన్నందునే అరవింద్‌‌కుమార్‌‌ రాలేకపోయారని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. గతంలో ఇంట్లో ఫంక్షన్‌‌ ఉందని చెప్పి రాలేదని, ఇప్పడు సీఎంతో మీటింగ్​అని రాలేదని మండిపడింది. ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించినట్లు చెబుతోందని, క్షేత్రస్థాయిలో పనులు మాత్రం నామమాత్రంగా ఉన్నాయని తప్పుపట్టింది. ఏజీ నివేదిక ఎందుకివ్వలేదని ప్రశ్నించింది. అరవింద్‌‌కుమార్‌‌కు అరెస్ట్‌‌ వారెంట్‌‌ జారీ చేస్తామని చెప్పింది. దీంతో వారం రోజుల గడువు ఇవ్వాలని హరీందర్‌‌ కోరడంతో విచారణను 23కి వాయిదా వేసింది. సీఎస్, మున్సిపల్ స్పెషల్ సీఎస్ స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది.