రాజాసింగ్ కేసులో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం

రాజాసింగ్ కేసులో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం

రాజాసింగ్పై పీడీ యాక్ట్ కు సంబంధించిన పిటిషన్పై హైకోర్టు విచారణ వాయిదా వేసింది. కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణలోగా  పీడీ యాక్ట్ పెట్టడానికి గల కారణాలు కౌంటర్ ద్వారా తెలపాలని మరోసారి ప్రభుత్వానికి ఆదేశించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది కేసుకు సంబంధించి 1650 పేజీల కౌంటర్ సిద్ధం చేశారని, అయితే దానిపై సంతకం చేయాల్సి ఉందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. కౌంటర్ దాఖలుకు వారం రోజుల సమయం కావాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి వారంలోగా కౌంటర్ దాఖలు చేయని పక్షంలో ఆర్డర్స్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. తదుపరి విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు.

పీడీ యాక్ట్ కొట్టేయాలని రాజాసింగ్ భార్య ఉషా బాయి దాఖలు చేసిన పిటిషన్ పై ఇయ్యాళ కోర్టు విచారణ జరిపింది. రాజా సింగ్ పై పీడీ యాక్ట్ అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉషాబాయి కోర్టును ఆశ్రయించారు. తన భర్తను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. తన భర్త అరెస్ట్ విషయంలో హైదరాబాద్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించారని, నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసినందున రిమాండ్‌కు పంపేందుకు కింది కోర్టు తిరస్కరించిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించారు. రాజ్యాంగంలోని 14, 21 అధికారాలకు ఉల్లంఘిస్తూ ఆగస్టు 26 నుంచి రాజా సింగ్ను అక్రమంగా నిర్బంధించారని రాజాసింగ్ భార్య ఆరోపించారు. 

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాజా సింగ్‌ను బీజేపీ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అనంతరం రాజా సింగ్‌ను కిందటి నెల ఆగస్టు 23వ తేదీన మొదటిసారి అరెస్టు చేశారు. అదే రోజు ఆయనకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అనంతరం పోలీసులు అదేనెల 26వ తేదీన పీడీ యాక్ట్ కింద ఆయనను అదుపులోకి తీసుకున్నారు.