కరోనాపై విచారణ.. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

కరోనాపై విచారణ.. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

కరోనా చికిత్సలు, టెస్టులు సరిగా నిర్వహించకుండా తెలంగాణ ప్రజలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కరోనా పరిస్థితులపై ఇవాళ(సోమవారం,జులై-20) తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా పరీక్షలు, సమాచారం ఇచ్చే తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని కోర్టు ప్రశ్నించింది. అధికారులపై కేసు పెట్టి, సస్పెండ్‌ చేయాలని ఎందుకు ఆదేశించకూడదో చెప్పాలని ఏజీని ప్రశ్నించింది. పదేపదే ఆదేశిస్తున్నా ఒక్కటి కూడా అమలు కావడం లేదని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీ, ఏపీ రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షల్లో రాష్ట్రం చాలా వెనకబడి ఉందని కోర్టు తెలిపింది. ఓవైపు కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందపటూ కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. బులెటిన్లలో ఇప్పటికి సమగ్ర వివరాలు ఇవ్వడం లేదని, ఆసుపత్రుల వారీగా బెడ్లు, వెంటిలేటర్ల వివరాలు ఇవ్వడం లేదని కోర్టు నిలదీసింది. అధికారులు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టి కోర్టును తప్పు దోవ పట్టిస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేసింది. చివాట్లు వేస్తుంటే అభినందించినట్లు ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తారని  ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు