తహసీల్దార్​ చెప్తే హైకోర్టునూ కూల్చేస్తరా?.. హైడ్రా కమిషనర్​ రంగనాథ్​పై హైకోర్టు ఆగ్రహం

తహసీల్దార్​ చెప్తే హైకోర్టునూ కూల్చేస్తరా?.. హైడ్రా కమిషనర్​ రంగనాథ్​పై హైకోర్టు ఆగ్రహం
  • జైలుకు వెళ్లే పరిస్థితి తెచ్చుకోవద్దని వార్నింగ్​
  • అమీన్​పూర్​ నిర్మాణాల కూల్చివేతపై సీరియస్
  • మీరు ఇట్లనే చేస్తే హైడ్రా జీవో 99పై స్టే ఇవ్వాల్సి వస్తది
  • శని, ఆదివారాల్లో కూల్చివేతలు వద్దంటే ఎందుకు చేపట్టారు?
  • రాజకీయ బాస్‌ల మాట వింటే బలిపీఠం ఎక్కేది మీరే
  • రాత్రికి రాత్రే హైదరాబాద్​ మారిపోవాలంటే ఎట్ల?
  • చెరువుల్లో ఆక్రమణల కూల్చివేతను మేం అడ్డుకోవడం లేదు
  • కానీ, రూల్స్​ ప్రకారమే ముందుకు వెళ్లాలని చెప్తున్నం
  • కూల్చివేతలే మీ లక్ష్యమా? ట్రాఫిక్​ గురించి పట్టించుకోరా?
  • హైడ్రాకు ఉన్న విధానమేమిటో చెప్పాలని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: హైడ్రాకు విధానమంటూ ఏముందని.. ఆగమాగం కూల్చివేతలు ఎందుకని హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ను హైకోర్టు ప్రశ్నించింది. రాత్రికి రాత్రే అన్నీ మారిపోవాలనుకుంటే ఎట్ల అని, హైదరాబాద్​ను ఉన్నఫళంగా మార్చాలనుకోవడం ఏమిటని నిలదీసింది. శని, ఆదివారాల్లో, సూర్యాస్తమయం తర్వాత కూల్చరాదన్న ఆర్డర్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇట్లనే ముందుకు వెళ్తే హైడ్రా ఏర్పాటుకు ఇచ్చిన జీవో 99పై స్టే ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. తహసీల్దార్​ చెప్తే హైకోర్టు​ను కూడా కూల్చేస్తారా? అని ఫైర్​ అయింది. చెరువుల్లో ఆక్రమణలను తొలగించొద్దని తాము చెప్పడం లేదని.. నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని చెప్తున్నామంది.  

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో హైడ్రా సహకారంతో తహసీల్దార్‌ చేపట్టిన కూల్చివేతల వ్యవహారంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. అమీన్‌పూర్‌ సర్వే నెం.164లోని ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను 48 గంటల్లో తొలగించాలంటూ సెప్టెంబర్​ 20న తహసీల్దార్‌ ఇచ్చిన నోటీసును సవాల్​ చేస్తూ డాక్టర్‌ మహమ్మద్‌ రఫీ, అమీన్‌పూర్‌కు చెందిన గణేశ్​ కన్‌స్ట్రక్షన్స్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతోపాటు పటేల్‌గూడలో విల్లాల కూల్చివేతలపై ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ కె.శ్రీనివాసరావు, కోటేశ్వరరావు ఇతరులు మరో పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌  విచారణ చేపట్టారు.అక్రమ నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో వ్యక్తిగతంగాఅమీన్‌‌పూర్‌‌ తహసీల్దార్‌‌ రాధ, వర్చువల్​గా హైడ్రా కమిషనర్‌‌ రంగనాథ్‌‌ విచారణకు హాజరై హైకోర్టు వేసిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. 

జైలుకు పంపే పరిస్థితి తెచ్చుకోవద్దు

అమీన్​పూర్​ నిర్మాణలపై కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూల్చివేయడం ఏమిటని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కోర్టు ఆర్డర్స్​ను ఎందుకు ఉల్లంఘించారని, ఎందుకు కూల్చివేతలు చేపట్టారని, అది కూడా సెలవు రోజుల్లు చేపట్టడం ఏమిటని అమీన్‌‌పూర్‌‌ తహసీల్దార్, హైడ్రా కమిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇట్లనే పరిస్థితి ఉంటే హైడ్రా ఏర్పాటు జీవో 99 అమలును నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేయాల్సివస్తుందని హైకోర్టు హెచ్చరించింది. రాజకీయ బాస్‌‌లు, ఉన్నతాధికారుల బాస్‌‌ల మాటలు వింటే బలిపీఠం ఎక్కాల్సివస్తుందని తెలిపింది. 

కూల్చివేతలే లక్ష్యంగా చర్యలు ఉంటే, అదీ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే, కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోతే చివరికి చర్లపల్లి, చంచల్‌‌గూడ జైళ్లకు పంపితేనే పరిస్థితులు మారుతాయేమోనని కోర్టు తీవ్రంగా హెచ్చరించింది. శని, ఆదివారం, సెలవు దినా ల్లో కూల్చరాదన్న ఇదే హైకోర్టు తీర్పును ఎందుకు ఉల్లంఘించారని ప్రశ్నించింది. సూర్యాస్తమయం తర్వాత కూల్చేవేతలు చేపట్టొద్దని తెలియదా? అని నిలదీసింది. 

గుడ్డిగా మిషీన్లు పంపుతరా?

అమీన్‌‌పూర్‌‌లో అక్రమణల తొలగింపునకు మెన్‌‌ అండ్‌‌ మిషన్‌‌ కావాలని తహసీల్దార్‌‌ లేఖ రాస్తే తాము వాటిని సమకూర్చినట్లు  హైడ్రా కమిషనర్‌‌  రంగనాథ్‌‌  చెప్పారు. దీంతో హైకోర్టు స్పందిస్తూ.. అమీన్‌‌పూర్‌‌లో ఏమి కూల్చేస్తున్నారో తెలుసుకోకుండా మెన్‌‌ అండ్‌‌ మిషన్స్‌‌ పంపుతారా? అని ప్రశ్నించింది. ‘‘తహసీల్దార్‌‌ లేఖ రాస్తే నిబంధనలను పరిశీలించకుండా గుడ్డిగా యంత్రాలను పంపిస్తారా?  రేపు ఇదే తరహాలో హైకోర్టు, చార్మినార్​ను కూడా కూల్చడానికి మిషీన్లను పంపాలని అడిగితే పంపుతరా? రూల్స్​ పరిశీలించరా?” అని మండిపడింది. 

ట్రాఫిక్ ​జోలికి ఎందుకు పోతలే?

ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల కూల్చివేతల్లో హైడ్రా అనుసరిస్తున్న తీరు కరెక్ట్​గా లేదని, హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి కూల్చివేతలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుందని హైకోర్టు ఫైర్​ అయింది.  జీవో 99 ప్రకారం అందులో పేర్కొన్న ఇతర విధులైన విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్‌‌ నియంత్రణ వంటి అంశాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని హైడ్రా కమిషనర్​ను ప్రశ్నించింది. ఇదే విధంగా హైడ్రా పనిచేస్తూపోతే  హైడ్రా జీవో 99పై దాఖలైన రెండు పిటిషన్ల విచారణ తర్వాత స్టే ఇవ్వాల్సివస్తుందని హెచ్చరించింది. పొలిటికల్, అధికారంలోని బాస్‌‌లు చెప్పినట్లు చేస్తే మీరే బాధ్యులవుతారని హితవుపలికింది.  ప్రస్తుతం ఉన్న పోస్టు ల్లో ఎప్పటికీ ఉండిపోరని, మళ్లీ బదిలీలు తప్పవని, అలాంటప్పుడు బాస్​లు చెప్పారంటూ నిబంధనలను ఉల్లంఘిస్తే దాని పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. శని, ఆదివారాలతోపాటు సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఉండరాదని హైకోర్టు తీర్పు ఉన్నా ఎందుకు ఉల్లంఘించారని తహసీల్దార్‌‌ను హైకోర్టు నిలదీసింది.

ఉరివేసే ముందు కూడాచివరి కోరిక అడుగుతం కదా?

‘‘ఉరి వేసే ముందు కూడా చివరి కోరిక అడుగుతారు. ఇది సహజ న్యాయసూత్రం. నోటీసులకు పిటిషనర్లు ఇచ్చిన వివరణ పరిశీలించరా? కోర్టు ఉత్తర్వులు చద వరా? స్టేలున్నా ఎలా కూలుస్తారు? 5 నెలలు ఆగినవారు మరో రోజు ఆగలేరా? 48 గంటల గడువు ఇచ్చి అది పూర్తయ్యేదాకా కూడా ఆగరా?’’ అంటూ అమీన్​పూర్​ కూల్చివేతలపై తహసీల్దార్​ను హైకోర్టు నిలదీసిం ది. సర్వే ముందు పిటిషనర్లకు నోటీసులు ఇవ్వరా? అని ప్రశ్నించింది. అసలు సర్వే చేసే విధానం ఏమిటో తెలు సా? అంటూ మండిపడింది. 

48 గంటల్లో భవనాన్ని ఖాళీ చేయాలని 20వ తేదీన నోటీసు ఇచ్చినప్పుడు 48 గంటల సమ యమూ ఇవ్వకుండా ఆదివారం ఎలా కూల్చివేతలు చేపడతారని ప్రశ్నించింది.  ‘‘ఆదివారం సెలవు అయినప్పుడు కుటుంబంతో గడపకుండా కూల్చివేతలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది. శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టరాదని ఇదే హైకోర్టు ఫుల్‌‌బెంచ్‌‌ తీర్పు ఇచ్చింది. దీన్ని పట్టించుకోరా? అసలు కోర్టు ఉత్తర్వులను చదివారా? అన్ని రకాలుగా స్టేలున్నప్పుడు ఎలా చర్య లు తీసుకుంటారు. అన్ని నోటీసులు ఒకే రోజు ఇచ్చి చర్యలు చేపడతారా? ఇదేనా మీకు తెలిసిన చట్టం?  ఇన్ని ఉల్లంఘనలకు ఎందుకు పాల్పడాల్సి వచ్చింది.

నిబంధనలకు విరుద్ధంగా వెళ్లాలని కలెక్టర్‌‌ ఆదేశాలు ఇచ్చారా? అలాగైతే చెప్పండి ఆ కలెక్టర్​ను పిలిపించి వివరణ అడు గుతాం. కోర్టు ఉత్తర్వులు అమలు చేయనప్పుడు జైలుకు పంపితే అప్పుడు తెలుస్తుంది” అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం కూల్చివేతలు చేపట్టరాదన్న విషయం తహసీల్దార్‌‌కు తెలియకపోతే ఉన్నతాధికారిగా మీకు తెలియదా అంటూ హైడ్రా కమిషనర్​ను ప్రశ్నించింది. కూల్చివేతల నిమిత్తం యంత్రాలు, మనుషులను పంపాలని తహసీల్దార్‌‌ కోరినప్పుడు ఆదివారం నిరాకరించాల్సింది పోయి ఎలా కూల్చివేతలు చేపట్టారని అడిగింది. ఈ దశలో హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ సమాధానమిస్తూ.. తమది సమన్వయం చేసే ఏజన్సీ మాత్రమేనని, తహసీల్దార్‌‌ లేఖ రాయడంతోనే యంత్రాలను పంపామన్నారు. 

ఎఫ్​టీఎల్​ ఎందుకు నిర్ధారించలే?

హైడ్రాకు ఉన్న విధానం ఏమిటో చెప్పాలని కమిషనర్​ను హైకోర్టు ప్రశ్నించింది. కమిషనర్‌‌ సమాధానమిస్తూ .. 70 శాతం చెరువులు ఆక్రమ ణలకు గురయ్యాయని, నగరంలో 2,500 దాకా చెరువులున్నాయని, వాటినైనా పరిరక్షించాల న్నదే లక్ష్యమన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసు కుంటూ.. ఎన్ని చెరువులకు ఎఫ్‌‌టీఎల్‌‌ను ధ్రువీక రించి నోటిఫికేషన్‌‌ జారీ చేశారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలోనూ, ప్రస్తుత ప్రభుత్వంలోనూ చెరువులను గుర్తించి ఎఫ్‌‌టీఎల్‌‌ను నిర్ధారించిన తర్వాత చర్యలు చేపట్టాలని ఆదేశించినా ఇప్ప టివరకు ఒక్క చెరువుకూ ఎఫ్‌‌టీఎల్‌‌ నిర్ధారించ లేదన్నారు. ‘‘బతుకమ్మకుంట, నల్లకుంటలు ఏమ య్యాయి? ఇబ్రహీంపట్నం చెరువు ఎందుకు నిండటం లేదు? రాత్రికి రాత్రే పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాలంటే ఎట్ల?” అని ప్రశ్నించారు. చెరువుల్లో ఆక్రమణలను తొలగిం చరాదని తాము చెప్పడంలేదని, నిబంధనల ప్రకారమే చేపట్టాలని చెప్తున్నామన్నారు.  

ఒకవే ళ నోటీసులు ఇచ్చినా అక్రమాలు కొనసాగిస్తున్న ట్లయితే ఆస్తులను సీజ్‌‌ చేసే అధికారం ఉందని, అట్ల ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. అధి కా రం ఉన్నప్పుడు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోకుండా వాటికి విరుద్ధంగా కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని అడిగారు. ప్రస్తుతా నికి ఈ పిటిషన్లలో యథాతథస్థితిని కొనసాగిం చాలని ఇరుపక్షాలను ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని తహసీల్దార్, హైడ్రా కమిషనర్​ను ఆదేశిస్తూ విచారణను అక్టోబర్​ 15కు వాయిదా వేశారు. తదుపరి విచారణకు హాజరుకావాల్సిన అవసరంలేదని చెప్పారు.  

మూసీ ఆక్రమణలపై ఇప్పటికిప్పుడు చర్యలు ఉండవు: ప్రభుత్వం

మూసీ పరీవాహక ప్రాంతంలో గుర్తించిన ఆక్రమణలను ఇప్పటికిప్పుడు తొలగించడంలేదని ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ప్రస్తుతం హైలెవల్‌‌‌‌ కమిటీ బాధితులతో చర్చలు జరుపుతున్నదని తెలిపింది. మూసీ పరీవాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాల గుర్తింపునకు సంబంధించి అధికారులు మార్కింగ్‌‌‌‌ చేయడంతో కూల్చివేతలపై ఆందోళనతో అత్యవసరంగా పలు లంచ్‌‌‌‌ మోషన్‌‌‌‌ పిటిషన్‌‌‌‌లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై జస్టిస్‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌ సోమవారం విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ తేరా రజనీకాంత్‌‌‌‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఇప్పటికిప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టడంలేదన్నారు. 

ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైందని, ఇది బాధితులతో చర్చలు జరుపుతోందన్నారు. అంతేగాకుండా ఇండ్లు కోల్పోయిన పేదలకు ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. ఇలాంటి పేదలు సుమారు 2,100 మంది దాకా ఉన్నట్లు కలెక్టర్‌‌‌‌ గుర్తించారన్నారన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి తొలగింపు చర్యలు చేపట్టడంలేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి మూసీ పరీవాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగింపునకు ఏదైనా విధానం రూపొందించారా అంటూ ప్రశ్నించారు. 1999లో సర్వే చేసి ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ నిర్ధారించిన తరువాత దానికి అవతల చేపట్టిన నిర్మాణాలను ఇప్పుడు ఎలా తొలగిస్తారన్నారు. మూసీ అభివద్ధిలో భాగంగా ఏ చర్య చేపట్టినా చట్ట నిబంధనల ప్రకారం వెళ్లాలని ఆదేశిస్తూ విచారణను 16కు వాయిదా వేశారు.

అమీన్​పూర్​లో కూల్చివేతలపై హైకోర్టు

ఆదివారం సెలవు అయినప్పుడు కుటుంబంతో గడపకుండా కూల్చివేతలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది. శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టరాదంటూ ఇదే హైకోర్టు ఫుల్‌బెంచ్‌ తీర్పు వెలువరించింది. దీన్ని పట్టించుకోరా? అసలు కోర్టు ఉత్తర్వులను చదివారా? అన్ని రకాలుగా స్టేలున్నప్పుడు ఎలా చర్యలు తీసుకుంటారు. అన్ని నోటీసులు ఒకే రోజు ఇచ్చి చర్యలు చేపడతారా? ఇదేనా మీకు తెలిసిన చట్టం? నిబంధనలకు విరుద్ధంగా వెళ్లాలని కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారా? అట్లయితే చెప్పండి ఆ కలెక్టర్​నే పిలిపించి వివరణ అడుగుతాం.