రాష్ట్ర సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం

రాష్ట్ర సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం
  • రాష్ట్ర సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం 
  • నెలలోగా పరిష్కరిస్తామని నవీన్ మిట్టల్ హామీ 

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్​లో సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని రాష్ట్ర సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్యలను పరిష్కరించకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించింది. 45 రోజుల గడువులోగా దరఖాస్తులను పరిష్కరించాలన్న నిబంధన ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసింది. రెవెన్యూ డిపార్ట్‌‌మెంట్‌‌లో రిజిస్టర్‌‌ సేల్‌‌ డీడ్స్, సర్టిఫైడ్‌‌ కాపీలు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే ధరణి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ధరణి సమస్యలపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. విచారణకు సీసీఎల్‌‌ఏ చీఫ్‌‌ కమిషనర్‌‌ నవీన్‌‌ మిట్టల్‌‌ వ్యక్తిగతంగా హాజరయ్యారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎఫ్‌‌–లైన్‌‌ అప్లికేషన్లు, వేలంలో కొన్న వాళ్లకు బ్యాంకులు చేసే సేల్‌‌ డీడ్‌‌లను అనుమతించకపోవడం, జీపీఏ, ఎస్‌‌పీఏల ఆధారంగా రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వకపోవడం, అప్లికేషన్లను ‘రిజెక్ట్‌‌’ అంటూ ఒక్క వాక్యంతో తిరస్కరించడం తదితర అంశాలపై ఆయన హైకోర్టుకు వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రభుత్వంపై జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ మండిపడ్డారు. ఎన్ని రోజుల్లోగా సమస్యలను పరిష్కరిస్తారని ప్రశ్నించారు. స్పందించిన నవీన్ మిట్టల్.. నెలలోగా సమస్యలన్నీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ప్రభుత్వం ఇచ్చిన వివరణలపై తర్వాత ఉత్తర్వులు ఇస్తామని జస్టిస్‌‌ లక్ష్మణ్‌‌ వెల్లడించారు.