ఆలయ భూముల రక్షణకు ఏం చర్యలు తీసుకున్నరు? : హైకోర్టు

ఆలయ భూముల రక్షణకు ఏం చర్యలు తీసుకున్నరు? : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు :  మహబూబ్​నగర్‌ జిల్లాలోని ఆలయ భూముల్ని రియల్టర్లు కబ్జా చేసి లేఔట్లు వేశారని వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని దాఖలైన పిల్‌ను హైకోర్టు బుధవారం విచారించింది. ఆలయ భూముల్లో ఇండ్ల స్థలాల లేఔట్లు వేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఆ భూముల రక్షణకు తీసుకున్న చర్యలేమిటో  చెప్పాలని కోరింది. సీఎస్​, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల దేవాలయ అధికారులకు నోటీసులు జారీ చేసింది.

తదుపరి విచారణను చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ తుకారాంజీలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆగస్టు 10కి వాయిదా వేసింది. దేవాలయ భూములు కబ్జా అవుతున్నాయని పత్రికల్లో వచ్చిన వార్త క్లిప్పింగ్‌లతో జడ్చర్లకు చెందిన అనిల్‌ కుమార్‌ హైకోర్టుకు లెటర్ రాశారు. దాన్నికోర్టు పిల్‌గా తీసుకుని విచారణ చేస్తోంది.