
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మెంబర్స్ నియామక రికార్డులను ఇవ్వాలని రాష్ట్ర సర్కారును హైకోర్టు గురువారం ఆదేశించింది. మెంబర్స్‌ను ఏ ప్రాతిపదికన నియమించారో పరిశీలిస్తామని తెలిపింది. రూల్స్‌కు వ్యతిరేకంగా టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకం జరిగిందంటూ ప్రొఫెసర్ వినాయక్‌రెడ్డి గతేడాది పిల్ దాఖలు చేశారు. దీనిని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డిల డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. ఇది పిల్ కిందకు రాదని, మెంబర్స్ నియామకంపై అభ్యంతరాలుంటే రిట్ పిటిషన్లు వేయాలని సూచించింది.
పిటిషనర్ తరఫు లాయర్ స్పందిస్తూ.. మెంబర్స్‌పై వ్యక్తిగతంగా అభ్యంతరాల్లేవని, మెంబర్స్ నియామకాలే చట్ట ప్రకారం జరగలేదన్నారు. రమావత్ ధన్‌సింగ్ జీహెచ్‌ఎంసీలో ఈఎన్‌సీగా రిటైర్డు అయ్యారని, సుమిత్ర ఆనంద్ జడ్పీ స్కూల్‌లో తెలుగు టీచరని, ఏ ప్రభుత్వ సర్వీసులోనూ చేయని ఎ.చంద్రశేఖర్‌రావు ఆయుర్వేదిక్ డాక్టరని, మరొకరు రిటైర్డు డిప్యూటీ తహసీల్దార్ రవీందర్‌రెడ్డి అని, ఎమ్మెల్సీగా చేసిన సబ్ ఎడిటర్/రిపోర్టర్ ఆర్.సత్యనారాయణను మెంబర్స్‌గా నియమించారని చెప్పారు. రూల్స్ ప్రకారం రాష్ట్ర సివిల్ సర్వీసెస్‌లో ఫస్ట్ క్లాస్ గెజిటెడ్ పోస్టుల్లో చేసిన వాళ్లే అర్హులన్నారు. నియామకాలు 2017లోని జీవో 54 ప్రకారం జరిగాయని ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. రూల్స్ తప్పుగా పబ్లిష్ అయ్యాయని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. నచ్చినవాళ్లను మెంబర్స్‌గా నియమించారా లేక ఏదైనా పరీక్ష పెట్టారా, నోటిఫికేషన్ ఇచ్చారా, సెర్చ్ కమిటీ ఏమైనా ఉందా.. అని ప్రశ్నలు వేసింది. మెంబర్స్ నియామక ఫైళ్లను తమకు నివేదించాలని ఆదేశించి విచారణను వాయిదా వేసింది.