జీవిత ఖైదు అంటే జీవితాంతమే

జీవిత ఖైదు అంటే జీవితాంతమే

హైదరాబాద్, వెలుగు: జీవితఖైదు శిక్ష అంటే బతికి ఉన్నంతకాలమని లేదంటే గవర్నర్‌‌‌‌‌‌‌‌ రెమిషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చే వరకు అని హైకోర్టు స్పష్టం చేసింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి హత్య కేసులో హంతకుడికి కింది కోర్టు జీవిత ఖైదు విధించింది. తన తండ్రి 18 ఏండ్ల జైలు శిక్ష పూర్తి చేసినందున విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అతని కొడుకు వేసిన హెబియస్‌‌‌‌‌‌‌‌ కార్పస్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను హైకోర్టు డిస్మిస్‌‌‌‌‌‌‌‌ చేసింది. జీవిత ఖైదు శిక్ష అంటే18 ఏండ్లు పూర్తి చేయడం కాదని తేల్చిచెప్పింది. గవర్నర్‌‌‌‌‌‌‌‌ రెమిషన్ (క్షమాభిక్ష) ప్రసాదిస్తేనే విడుదలకు వీలుంటుందని, అంతేతప్ప 18 ఏండ్ల శిక్ష తర్వాత కూడా జైలులో ఉంటే అక్రమ నిర్బంధం కాదని ఈ మేరకు జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఎ.అభిషేక్‌‌‌‌‌‌‌‌రెడ్డి, జస్టిస్‌‌‌‌‌‌‌‌ అనుపమ చక్రవర్తితో కూడిన డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ ఇటీవల తీర్పు చెప్పింది.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని సనత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఎస్‌‌‌‌‌‌‌‌కే జకారియా అనే సదరు దోషి కొడుకు ఎస్ కే రషీద్ దాఖలు చేసిన పిటిషన్ ను బెంచ్ విచారించింది. ఇదే కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, క్షమాభిక్ష అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని, గవర్నర్‌‌‌‌‌‌‌‌ ఆమోదం లాంఛనమేనన్న పిటిషనర్‌‌‌‌‌‌‌‌ వాదననూ బెంచ్ తోసిపుచ్చింది. ప్రభుత్వ ఉద్యోగి హత్యకు గురైనప్పుడు విధుల్లో లేడన్న వాదననూ తిరస్కరించింది. ప్రభుత్వం తరఫున స్పెషల్‌‌‌‌‌‌‌‌ ప్లీడర్‌‌‌‌‌‌‌‌ సదాశివుని ముజీబ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ వాదిస్తూ.. జీవితఖైదు శిక్షలో ఉన్న వ్యక్తికి గవర్నర్‌‌‌‌‌‌‌‌ క్షమాభిక్ష ప్రసాదించే వరకు శిక్షను తగ్గించాలని కోరే హక్కు ఉండదన్నారు. నేరస్తుడు ఎన్ని ఏండ్లు జైలులో ఉండాలనే విషయాన్ని కింది కోర్టు కూడా చెప్పలేదన్నారు. దీంతో రెమిషన్ ఆదేశాలు జారీ అయ్యే వరకూ విడుదలచేయడం కుదరదని చెప్తూ పిటిషన్ ను బెంచ్ డిస్మిస్ చేసింది. 

స్టేటస్‌‌‌‌‌‌‌‌కో అంటే చూస్తూ ఉండాలని కాదు..   

ఏదైనా ఒక కోర్టు స్టేటస్‌‌‌‌‌‌‌‌కో (యధాతథస్థితి) ఉత్తర్వులు ఇస్తే.. అక్రమ నిర్మాణం కొనసాగుతున్నా చూస్తూ ఊరుకోవాలని కాదని జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఆఫీసర్లపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. స్టేటస్ కో అంటే.. ఆ ఉత్తర్వులు పొందిన వ్యక్తి అక్రమ నిర్మాణాలను కొనసాగించేందుకు పర్మిషన్ ఇవ్వడం కాదని మరో కేసులో కోర్టు తేల్చిచెప్పింది.