108 ఉద్యోగుల తొలగింపు చెల్లదు

108 ఉద్యోగుల తొలగింపు చెల్లదు
  • నోటీసు ఇవ్వకుండా ఎలా తీసేస్తారు?
  • మేనేజ్​మెంట్​ను ప్రశ్నించిన హైకోర్టు
  • వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు : జీవీకే ఈఎంఆర్ఐలో పనిచేస్తున్న 108 సర్వీస్‌ ఉద్యోగులను తొలగించడం చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. నోటీసు కూడా ఇవ్వకుండా ఉద్యోగం నుంచి ఎలా తీసేస్తారని నిలదీసింది. ఇది సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని తెలిపింది. కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్నప్పటికీ తొలగించే ముందు వాళ్ల వివరణ కోరుతూ నోటీసు ఇవ్వాలన్న సహజ న్యాయ సూత్రాలను యాజమాన్యం ఉల్లంఘించిందని తీర్పు చెప్పింది. 

గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా 747 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుని.. మరో 187 మందిని తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. ఇది సమానత్వ చట్ట నిబంధనను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది. 187 మందిని 8 వారాల్లో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జస్టిస్ సూరేపల్లి నంద.. జీవీకే ఈఎంఆర్ఐ యాజమాన్యాన్ని ఆదేశించారు. 

వాట్సాప్ లో మెసేజ్ పెట్టి తొలగించిన జీవీకే

ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్స్, పైలట్ డ్రైవర్స్‌ (అంబులెన్స్‌ డ్రైవర్లు), ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ ఆఫీసర్స్‌లను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ స్టేట్ 108 ఎంప్లాయీస్ యూనియన్ 2018లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనర్ తరఫున అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. నోటీసు ఇవ్వకుండా కేవలం వాట్సాప్ మెసేజ్ ద్వారా చెప్పి ఉద్యోగాల నుంచి తొలగించారని చెప్పారు. రోజుకు 8 గంటలు పని చేయాలన్న నిబంధనకు వ్యతిరేకంగా 12 గంటలు పని చేయించడాన్ని ఉద్యోగులు ప్రశ్నించారని యాజమాన్యం కక్ష పెంచుకుందని వివరించారు. 

ఏకపక్షంగా ఉద్యోగులను తొలగించిందని తెలిపారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. దీనిపై జీవీకే తరఫు లాయర్ స్పందిస్తూ.. తమది స్వచ్ఛంద సంస్థ అని, రోజుకు 8 గంటలే పని చేయాలన్న ప్రభుత్వ నిబంధన వర్తించదని వాదించారు. వ్యక్తిగతంగా ఉద్యోగులను తొలగిస్తే యూనియన్ పిటిషన్ వేయడం చెల్లదన్నారు. 

ఎమర్జెన్సీ సర్వీస్ బాధ్యత ప్రభుత్వానిదే..

ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. జీవీకే వాదనలను తోసిపుచ్చింది. అత్యవసర వైద్య సర్వీసుల్ని అందించే బాధ్యత ప్రభుత్వానిదే అని తేల్చింది. ప్రభుత్వ ఒప్పందం మేరకు జీవీకే 108 సేవలు అందిస్తున్నదని వివరించింది. ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్న సేవలని, అందుకే 108 అంబులెన్స్​ల్లో పని చేసే వాళ్లకూ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. 

రోజుకు 8 గంటలకు బదులు 12 గంటలు పని చేయించడం చెల్లదని వివరించింది. 747 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుని.. 187 మందిని తీసుకోకపోవడం రాజ్యాంగంలోని 14, 19 అధికరణలకు విరుద్ధమని తెలిపింది. వారిని కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది.