
- ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్‌లోని దుర్గం చెరువు పరిరక్షణ చర్యల కోసం హైకోర్టు ముగ్గురితో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. నాగ్‌పూర్‌లోని ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్‌కు చెందిన అతుల్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శాంతి వర్ధన్‌లతో కమిటీని వేసింది. ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం ఆదేశాలిచ్చింది.
ఆరు వారాల్లోగా రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. దుర్గం చెరువు దుస్థితిపై ఒక ఇంగ్లిషు దినపత్రికలో వచ్చిన స్టోరీని హైకోర్టు సుమోటో పిల్‌గా తీసుకుంది. శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని గత విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యానించింది.
చెరువులోకి రసాయనాలు, ఔషధ ఫ్యాక్టరీల వ్యర్థాలు, ప్లాస్టిక్, మురుగు నీరు చేరడంతో కాలుష్యం తీవ్రంగా ఉందని, చేపలు చచ్చిపోయి తేలియాడుతున్నాయని ఆ కథనంలో పేర్కొన్నట్లు ప్రస్తావించింది. అమికస్‌క్యూరీగా ఉన్న సీనియర్ లాయర్ వేదుల శ్రీనివాస్ సిఫార్సు చేసిన పేర్లను పరిశీలించిన హైకోర్టు ఈ మేరకు పై ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేసింది.