బౌరంపేటలో ప్రభుత్వ భూమిరక్షణకు చర్యలేవి : హైకోర్టు

బౌరంపేటలో ప్రభుత్వ భూమిరక్షణకు చర్యలేవి : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌–గండిమైసమ్మ మండలం బౌరంపేటలో రూ.కోట్ల విలువైన పది ఎకరాల ప్రభుత్వ భూముల రక్షణకు తీసుకున్న చర్యలు వివరించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. సర్వే నంబర్లు తారుమారు చేయడం ద్వారా ఈ భూమిని ఆక్రమించుకున్నారనే అభియోగాలపై వివరణ ఇవ్వాలంది. ప్రతివాదులైన రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనర్, సబ్‌ రిజిస్ట్రార్లు, కలెక్టర్, గండిమైసమ్మ మండల తహసీల్దార్​తోపాటు ఆక్రమణలకు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్న వజ్ర బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్​కు నోటీసులిచ్చింది.

 బౌరంపేటలోని సర్వే నం.198లోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిని వజ్ర బిల్డర్లు. ఇతర ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకుని లేఅవుట్‌ వేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ సిద్ధిపేట జిల్లా కొండపాకకు చెందిన జి.రఘువీర్‌రెడ్డి పిల్‌ దాఖలు చేశారు. దీనిని మంగళవారం చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే. జస్టిస్‌ జె.అనిల్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.  వాదనల తర్వాత హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.