కేబీఆర్‌‌ పార్క్‌‌ వద్ద నిర్మాణాలపై నివేదికివ్వండి : హైకోర్టు

కేబీఆర్‌‌ పార్క్‌‌ వద్ద నిర్మాణాలపై నివేదికివ్వండి : హైకోర్టు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌ లోని కేబీఆర్‌‌ నేషనల్ పార్క్‌‌ పరిసరాల్లో చేపట్టిన ఫ్లైఓవర్లు, అండర్‌‌పాస్‌‌ల నిర్మాణాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పనులు పర్యావరణ పరిరక్షణ నిబంధనలకు, నిర్దేశించిన పరిమితులకు లోబడే జరుగుతున్నాయా లేదా అనే అంశంపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 

కేబీఆర్‌‌ పార్క్ చుట్టూ జరుగుతున్న నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనను ఎత్తిచూపుతూ పర్యావరణవేత్త కె. పురుషోత్తం రెడ్డి, ఇతరులు పిల్‌‌ దాఖలు చేశారు. దాన్ని చీఫ్‌‌ జస్టిస్‌‌ ఏకే సింగ్, జస్టిస్‌‌ మొహియుద్దీన్‌‌ బెంచ్‌‌ మంగళవారం విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. 2020లో  కేంద్రం జారీ చేసిన పర్యావరణ నోటిఫికేషన్ టైంలో ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదన్నారు. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రం తుంగలో తొక్కిందని ఆరోపించారు. 

దీనిపై అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ.. ఒక్క చెట్టును కూడా నరకలేదని, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నిబంధనల ప్రకారమే పనులు చేస్తున్నామని వివరించారు. వాదనల అనంతరం బెంచ్ స్పందిస్తూ..కేంద్ర నోటిఫికేషన్‌‌ను క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి విచారణలో వివరాలు సమర్పించాలని పిటిషనర్‌‌ను ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులు ప్రాధాన్యత కలిగినవని వ్యాఖ్యానించింది. రికార్డులో ఉంచిన ఫొటోలను ప్రస్తావిస్తూ.. కొనసాగుతున్న పనులలో ఒక నడకదారి నిర్మాణం కూడా ఉన్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. నిర్మాణాల ప్రస్తుత స్థితి, అవసరమైన అనుమతులు, పర్యావరణ నిబంధనల అమలు సహా పూర్తి నివేదికను సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. విచారణను మే 5కు వాయిదా వేసింది.