ఫీజులు పెంచాలన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు

ఫీజులు పెంచాలన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్‌: ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలని ప్రైవేట్‌ కాలేజీల అభ్యర్థనను తిరస్కరిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 6 వారాల్లోగా ఇంజినీరింగ్‌ ఫీజులను ఫిక్స్‌ చేయాలని ఫీజుల నియంత్రణ కమిటీని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లకు ఫుల్ డిమాండ్​ ఉంది. టాప్ కాలేజీల్లో కంప్యూటర్​ సైన్స్​ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) సీటు కోసం ఎంత ఫీజు అయినా చెల్లించేందుకు పేరెంట్స్ రెడీ అవుతున్నారు. డిమాండ్కు తగ్గట్టుగా సీట్లు లేకపోవడంతో, మేనేజ్మెంట్లు దీన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. అయితే, కొన్ని కాలేజీల్లో ఫీజు కట్టినా, మంచి ర్యాంకు లేకుంటే సీటు లభించే పరిస్థితులు కన్పించడం లేదు. 

మేనేజ్మెంట్ కోటాలో కేవలం కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సుల సీట్లకే పోటీ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో 1.18 లక్షల సీట్లున్నాయి. దీంట్లో 60 శాతానికిపైగా కంప్యూటర్ సైన్స్ దాని అనుంబంధ కోర్సులవే. అయితే, గతేడాది మొత్తం 1,07,160 సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్ కోటాలో 79,224, మేనేజ్మెంట్ కోటాలో 27,936 సీట్లు నిండాయి. స్టేట్​లో 175 కాలేజీలు ఉన్నా..15, 20 కాలేజీల్లోని సీట్లకే డిమాండ్ ఉంది. దీంతో ఆయా కాలేజీలు ఫీజులను భారీగా డిసైడ్ చేస్తున్నాయి.

సీఎస్ఈ వంటి హాట్​ కోర్సులు చేయాలనుకునేవారు మంచి కాలేజీల్లో సీటు పొందడం కష్టంగా మారింది. దీంతో, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడడం లేదు. ఈ కారణంతోనే మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్​ కోటా సీట్ల కోసం లక్షలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో సీఎస్ఈ అనుబంధ కోర్సుల్లోని సీట్లు టాప్ కాలేజీలలో రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముతున్నట్టు తెలుస్తోంది. సెకండరీ కాలేజీల్లోనూ రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల దాకా తీసుకుంటున్నారు.