గవర్నర్‌‌‌‌ కోటా ఎమ్మెల్సీల .. నియామకంపై స్టేకు హైకోర్టు నిరాకరణ

గవర్నర్‌‌‌‌ కోటా ఎమ్మెల్సీల .. నియామకంపై స్టేకు హైకోర్టు నిరాకరణ
  •  అలాంటి ఆదేశాలు గవర్నర్​కు జారీ చేయలేమని కామెంట్
  • దాసోజు, కుర్ర పిటిషన్లవిచారణార్హతను 8న తేలుస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: గవర్నర్‌‌‌‌ కోటా ఎమ్మెల్సీల నియామకంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కోర్టు కేసు తేలేవరకు స్టే ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను తిరస్కరించింది. గవర్నర్‌‌‌‌కు ఏవిధంగా ఆదేశాలు జారీ చేయగలమని ప్రశ్నించింది. గవర్నర్‌‌‌‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సూచిస్తూ గత ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను 2023, సెప్టెంబర్‌‌‌‌ 19న గవర్నర్‌‌‌‌ తమిళిసై రిజెక్ట్​చేసిన విషయం తెలిసింది. ఆ ఉత్తర్వులను సవాల్​ చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు.

దానిని చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే ఆధ్వర్యంలోని డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ బుధవారం మరోసారి విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌‌‌‌ లాయర్లు అదిత్యా సోదీ, మయూర్‌‌‌‌ రెడ్డి, గవర్నర్‌‌‌‌ కార్యదర్శి తరఫున సీనియర్‌‌‌‌ లాయర్‌‌‌‌  ఎస్‌‌‌‌.అశోక్‌‌‌‌ ఆనంద్‌‌‌‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ ఎ.సుదర్శన్‌‌‌‌ రెడ్డి వాదించారు. గత విచారణ సమయంలో పిటిషన్ల విచారణార్హత తేలుస్తామని హైకోర్టు చెప్పడంతో లాయర్లు అందరూ దానిపై వాదించేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఫిబ్రవరి 8న విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది.

దీనిపై పిటిషనర్ల లాయర్‌‌‌‌ కల్పించుకుని కోర్టులో కేసు విచారణ తేలే వరకు గవర్నర్‌‌‌‌ కోటా ఎమ్మెల్సీల నియామకం చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరగా అందుకు హైకోర్టు నిరాకరించింది. ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని, నియామకాలపై నిషేధం ఉన్నట్లుగా పరిగణిస్తామని ఏజీ చెప్పగా, తామేమీ వ్యాఖ్య చేయబోమని కోర్టు చెప్పింది. ఈ వివాదం కారణంగా నియామకాలపై గవర్నర్‌‌‌‌ నిర్ణయం పెండింగ్‌‌‌‌లో పెట్టారని, ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలని భావించారని గవర్నర్‌‌‌‌ లాయర్‌‌‌‌ చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. ఇలాంటి అంశాల్లో న్యాయ సమీక్షకు సంబంధించిన అంశాన్ని నిర్ణయిస్తామని ప్రకటించింది.