కేసు ఎందుకు తీసుకోలే?..విచారణకు రావాలని సీఐకి కోర్టు ఆదేశం

కేసు ఎందుకు తీసుకోలే?..విచారణకు రావాలని సీఐకి కోర్టు ఆదేశం

మియాపూర్​, వెలుగు: ఓ కేసు విషయంలో సరైన దర్యాప్తు చేపట్టకపోవడంతో మియాపూర్​ ఇన్​స్పెక్టర్​పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 29న హైకోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 2024లో మియాపూర్​ పోలీస్​ స్టేషన్​లో ఓ యువతి తన తండ్రిపై ఫిర్యాదు చేయగా, అప్పటి మియాపూర్​ ఇన్​స్పెక్టర్ క్రాంతికుమార్​​ పోక్సో కేసు ఫైల్​ చేశారు. ఈ కేసులో యువతి తండ్రిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. 

జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత యువతి తండ్రి.. తనపై తప్పుడు ఆరోపణలు చేసిందంటూ తన కుమార్తెపై మియాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై మియాపూర్​ ఇన్​స్పెక్టర్​ కేసు నమోదు చేయకపోవడంతో.. బాధితుడు హైకోర్టులో రిట్​ పిటిషన్​ దాఖలు చేశాడు. ఈ పిటిషన్​పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి... మియాపూర్​ ఇన్​స్పెక్టర్​ విచారణకు నేరుగా హాజరై కేసుకు సంబంధించిన వివరాలను చెప్పాలని ఆదేశించారు.