- రాష్ట్ర సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు
- సీఎస్ సహా కలెక్టర్లకు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదని రాష్ట్ర సర్కార్ ను హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రతివాదులైన చీఫ్ సెక్రటరీ, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి, గృహ నిర్మాణ సంస్థ, 33 జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. జిల్లాల్లో నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీజేపీ నేత ఎన్.ఇంద్రసేనా రెడ్డి వేసిన పిల్ పై చీఫ్ జస్టిస్ ఎస్‌సీ శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది.
రాజకీయ లబ్ధి కోసమే...
‘‘రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ లక్ష్యం 2.91 లక్షలు. 1.27 లక్షల ఇండ్లు నిర్మాణాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు 63 వేల ఇండ్లను మాత్రమే పూర్తి చేయగా, వాటిలో కేవలం 12,656 ఇండ్లనే లబ్ధిదారులకు కేటాయించారు. నిర్మాణాలు పూర్తయినా లబ్ధిదారులకు కేటాయించకుండా రాజకీయ లబ్ధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేచి చూస్తోంది” అని పిటిషనర్ తరఫు లాయర్ సృజన్ కుమార్ రెడ్డి వాదించారు. కట్టిన ఇండ్లను లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో అవి దెబ్బతింటున్నాయన్నారు. వాదనలు విన్న హైకోర్టు... నిర్మాణాలు పూర్తయినా, లబ్ధిదారులకు ఎందుకు కేటాయించడం లేదో వివరిస్తూ కౌంటర్ ఫైల్ చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.
