మున్సి‘పోల్స్‌‌’కు హైకోర్టు గ్రీన్​సిగ్నల్

మున్సి‘పోల్స్‌‌’కు హైకోర్టు  గ్రీన్​సిగ్నల్
  • పిటిషనర్లు ఆరోపణలను నిరూపించలేకపోయారన్న డివిజన్​ బెంచ్
  • పిటిషన్లు కొట్టివేత.. అసెంబ్లీ ఓటర్ల జాబితా వినియోగానికి ఓకే
  • స్టేలు ఉన్న 70కిపైగా మున్సిపాలిటీలపై మాత్రం అస్పష్టత
  • వాటి విషయాన్ని సింగిల్​జడ్జి వద్దే తేల్చుకోవాలన్న డివిజన్​ బెంచ్
  • త్వరలోనే క్లియరెన్స్‌‌ వచ్చే చాన్స్.. ఆ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్‌‌!

హైదరాబాద్‌‌, వెలుగు:

రాష్ట్రంలో మున్సిపల్‌‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక అడుగు ముందుకు పడింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితాల రూపకల్పన, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియల్లో లోపాలపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. రాజ్యాంగంలోని 243 (జెడ్) ఆర్టికల్​ ప్రకారం ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోరాదని, అందువల్ల తాము ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం లేదని పేర్కొంది. షెడ్యూల్​ ప్రకారం ఎలక్షన్ల నిర్వహణకు అనుమతిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ అభిషేక్‌‌రెడ్డిలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌  ఉత్తర్వులు జారీ చేసింది. అయితే స్టే ఉన్న 70కిపైగా మున్సిపాలిటీలకు సంబంధించి డివిజన్​ బెంచ్​ స్పష్టత ఇవ్వలేదు. ఆ అంశాన్ని సింగిల్​ జడ్జి వద్దే తేల్చుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సింగిల్​ జడ్జి వద్ద ఉన్న పిటిషన్లు కూడా రెండు, మూడు రోజుల్లో క్లియరయ్యే అవకాశముందని, ఆ వెంటనే ఎలక్షన్​ నోటిఫికేషన్​ జారీ అవుతుందని అధికారవర్గాలు చెప్తున్నాయి.

నిర్మల్‌‌కు చెందిన అన్జుకుమార్‌‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, లాయర్‌‌ ఎస్‌‌.మల్లారెడ్డి, మరికొందరు మున్సిపల్​ ఎలక్షన్ల ప్రక్రియపై హైకోర్టులో పిల్స్​ వేసిన విషయం తెలిసిందే. వార్డుల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల సంఖ్య, రిజర్వేషన్ల ఖరారు వంటివి నిబంధనల ప్రకారం చేయలేదని వారు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇక ఎంపీలమైన తమకు కనీసం సమాచారం ఇవ్వకుండానే వార్డుల విభజన చేశారని, ఒక పార్టీకి అనుకూలంగా ఈ ప్రక్రియ ఉందని కాంగ్రెస్‌‌, బీజేపీ ఎంపీలు కూడా ఈ కేసులో ఇంప్లీడ్‌‌ అయ్యారు. హైకోర్టు డివిజన్​ బెంచ్​ ఈ పిటిషన్లన్నీ కలిపి విచారణకు చేపట్టింది. గత నాలుగు నెలలుగా పలుమార్లు జరిగిన విచారణల్లో పిటిషనర్లు, ప్రభుత్వం వాదనలు విన్నది. ఈ నెల 1వ తేదీన అన్ని వర్గాల వాదనలు పూర్తవడంతో తీర్పును వాయిదా వేసింది. ఎలక్షన్లకు సంబంధించిన ముందస్తు ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు అనుమతి ఇస్తూ.. నోటిఫికేషన్​ మాత్రం విడుదల చేయరాదని ప్రభుత్వానికి సూచించింది. తాజాగా మంగళవారం తీర్పు వెలువరించింది.

అసెంబ్లీ లిస్ట్​తో నిర్వహించొచ్చు

రాజ్యాంగంలోని 243 జెడ్‌‌(జి) ఆర్టికల్‌‌ ప్రకారం ఎన్నికల వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోడానికి వీల్లేదని, ఆర్టికల్​ 329 ప్రకారం పాలకమండళ్ల గడువు ముగిసిన మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని డివిజన్​ బెంచ్ పేర్కొంది. ‘‘వివిధ వర్గాల ఓటర్లను, వారి వర్గాన్ని అధికారులు తప్పుగా గుర్తించినట్లు పిటిషనర్లు నిరూపించలేకపోయారు. ఒక్క ఓటరు విషయంలో కూడా అలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. ఓటర్ల నుంచి కూడా ఈ తరహా ఫిర్యాదులు వచ్చినట్టు చెప్పలేదు. మున్సిపల్‌‌ యాక్ట్‌‌ 11 ప్రకారం అసెంబ్లీ ఓటర్ల లిస్ట్‌‌ ఆధారంగా మున్సిపల్‌‌ ఎన్నికలు నిర్వహించవచ్చు. ఎన్నికల షెడ్యూల్‌‌ వెలువడేలోగా ఓటర్ల లిస్ట్‌‌ తయారు చేసుకోవచ్చు. ఎన్నికల షెడ్యూల్​ను స్టేట్‌‌ ఎలక్షన్‌‌ కమిషన్‌‌ ప్రకటించలేదు. ఈ తరుణంలో నోటిఫికేషన్‌‌ను సవాల్‌‌ చేయడం చెల్లదు. ప్రభుత్వం మున్సిపల్​ ఎలక్షన్లను నిర్వహించవచ్చు..” అని పేర్కొంది.

అక్కడే తేల్చుకోండి..

హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే సర్కారు తరఫున అడిషనల్‌‌ అడ్వొకేట్‌‌ జనరల్‌‌ జె.రామచందర్‌‌ రావు స్టే ఉన్న మున్సిపాలిటీల అంశాలన్ని డివిజన్​ బెంచ్​కు గుర్తుచేశారు. వాటికి కూడా ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరారు. అయితే ఆ మున్సిపాలిటీల వ్యవహారాన్ని సింగిల్‌‌ జడ్జి దగ్గరే తేల్చు కోవాలని డివిజన్‌‌ బెంచ్‌‌ స్పష్టం చేసింది.

ఎలక్షన్లపై ఎప్పుడేం జరిగింది?

మున్సిపల్‌‌ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం జూన్‌‌లో హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేసింది. అప్పటికే కొన్ని మున్సిపాలిటీలకు పాలకవర్గాలు లేకపోగా, మిగతావాటి టైం జూలై 15తో ముగుస్తుందని, వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని కోరింది. ఈ పిటిషన్‌‌పై కౌంటర్​ దాఖలు చేసిన సర్కారు.. ఎన్నికల నిర్వహణకు 109 రోజుల గడువు ఇవ్వాలని కోరింది. దానిపై స్పందించిన కోర్టు మరో పది రోజులు అదనంగా కలిపి 119 రోజులు గడువు ఇస్తామని పేర్కొంది. కానీ ఈ పిటిషన్‌‌ విచారణలో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా మున్సిపల్​ ఎలక్షన్లకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితాలు వంటివాటిని ఆగమాగం పూర్తిచేసింది. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వార్డుల విభజన అశాస్త్రీయంగా చేశారని, ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని కోర్టుకు విన్నవించారు. ఎంపీలమైన తమకు కనీసం సమాచారం ఇవ్వకుండానే వార్డుల విభజన చేశారని, ఒక పార్టీకి అనుకూలంగా ఈ ప్రక్రియ ఉందంటూ కాంగ్రెస్‌‌, బీజేపీ ఎంపీలు కూడా ఈ కేసులో ఇంప్లీడ్​ అయ్యారు. డివిజన్​ బెంచ్​ఈ అన్ని పిటిషన్లను కలిపి విచారణ చేపట్టింది.

వరుసగా స్టేలు

ఓవైపు మున్సిపోల్స్​పై డివిజన్​బెంచ్​వద్ద విచారణ జరుగుతుండగానే.. పలు మున్సిపాలిటీలకు చెందిన స్థానికులు హైకోర్టు సింగిల్​ జడ్జి వద్ద పిటిషన్లు వేశారు. వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారులో అక్రమాలు జరిగాయని విన్నవించారు. దాంతో సింగిల్​ జడ్జి వేర్వేరుగా 70కిపైగా మున్సిపాలిటీల్లో ఎలక్షన్లపై స్టే ఇచ్చారు. ఆ పిటిషన్లపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ విచారణ తుది దశకు చేరిందని, రెండు, మూడు రోజుల్లో సింగిల్‌‌ జడ్జి వద్ద ఎన్నికలకు అనుమతి వచ్చే అవకాశముందని అధికార వర్గాలు చెప్తున్నాయి. డివిజన్‌‌  బెంచ్‌‌ తీర్పు కాపీ వస్తే ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నాయి. మొత్తంగా కొద్దిరోజుల్లోనే స్పష్టత వస్తుందని పేర్కొంటున్నాయి.

128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు

రాష్ట్రంలో గతంలో 68 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లు ఉండగా.. 2018లో కొత్తగా మరో 67 మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టే సమయంలో ఏడింటిని కార్పొరేషన్లుగా అప్‌‌గ్రేడ్‌‌ చేశారు. దీంతో రాష్ట్రంలో మున్సిపాలిటీల సంఖ్య 128కి, కార్పొరేషన్ల సంఖ్య 13కు చేరింది. ఇందులో గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌, వరంగల్‌‌, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపల్‌‌ పాలకవర్గాల పదవీకాలం పూర్తికాలేదు. షెడ్యూల్డ్‌‌ ఏరియాల్లోని పాల్వంచ, మణుగూరు, మందమర్రిలో దశాబ్దాలుగా ఎన్నికలు నిర్వహించడం లేదు. జడ్చర్ల, నకిరేకల్‌‌ మున్సిపాలిటీల్లో సమీప గ్రామాల విలీన ప్రక్రియ పూర్తి కాలేదు. ఇవి మినహా కరీంనగర్‌‌, రామగుండం, నిజామాబాద్‌‌, బోడుప్పల్‌‌, ఫీర్జాదిగూడ, బడంగ్‌‌పేట్‌‌, నిజాంపేట్‌‌, బండ్లగూడ జాగీర్‌‌, మీర్‌‌పేట్‌‌, జవహర్‌‌నగర్‌‌ కార్పొరేషన్లతో పాటు 121 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌‌గ్రేడైన 60 మున్సిపాలిటీల్లో గతేడాది ఆగస్టు 2 నుంచి కూడా పాలకవర్గాలు లేవు.