కుభీర్ పోలీస్ స్టేషన్లో పోలీసులపై దాడి చేసిన ఉన్మాది అరెస్ట్

 కుభీర్ పోలీస్ స్టేషన్లో పోలీసులపై దాడి చేసిన ఉన్మాది అరెస్ట్

భైంసా, వెలుగు: నిర్మల్​ జిల్లా కుభీర్ పోలీస్ స్టేషన్​లో హెడ్​ కానిస్టేబుల్​ నారాయణ, హోంగార్డుపై కత్తితో దాడి చేసిన ఉన్మాది అబ్దుల్​ కలీంను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపారు. శుక్రవారం భైంసాలో ఏఎస్పీ అవినాశ్ కుమార్​ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతం ధర్మాబాద్​కు చెందిన అబ్దుల్​కలీం మూడ్రోజుల క్రితం కుభీర్​లోని అత్తగారింటికి వచ్చాడు. గురువారం ఇంటికి తాగి వెళ్లిన కలీం భార్యతో గొడవ పడ్డాడు. 

దీంతో భార్య పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసి కేసు పెట్టిస్తానని హెచ్చరించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కలీం తానే పోలీస్ స్టేషన్ వెళ్లి వాళ్ల సంగతి చూస్తానంటూ వెళ్లాడు. ఎస్సై గదికి వెళ్లగా అక్కడే విధుల్లో ఉన్న హెడ్​ కానిస్టేబుల్​ నారాయణ ఎందుకు వచ్చావ్​అని ప్రశ్నించారు. దీంతో కలీం తన వద్ద ఉన్న కత్తితో ఆయనపై దాడి చేశాడు. అడ్డుకునేందుకు యత్నించిన హోంగార్డు గిరిపై సైతం దాడి చేసి పారిపోయాడు. 

పోలీసులు క్షతగాత్రుడిని భైంసాకు తరలించి చికిత్స అందించారు. రూరల్ సీఐ నైలు, ఎస్సై కృష్ణారెడ్డి నిందితుడి కోసం గాలింపు చేపట్టి అర్ధరాత్రి కుభీర్​ శివారులోని ఓ పంట చేనులో దాక్కొని ఉన్న కలీంను అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు. దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నామని, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో భైంసా టౌన్ సీఐ గోపీనాథ్, రూరల్ సీఐ నైలు, ముథోల్ సీఐ మల్లేశ్, కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి పాల్గొన్నారు.