270 మంది టీచర్ల నియామకానికి చర్యలు : కలెక్టర్ కుమార్ దీపక్

270 మంది టీచర్ల నియామకానికి చర్యలు : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్లా ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైందని, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ బాయ్స్​హైస్కూల్​లో శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా టీఎల్ఎం మేళాకు డీఈవో ఎస్.యాదయ్య, అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్​ను బంగారుమయం చేసి, వారి జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత గల వృత్తి టీచర్లదని అన్నారు.

 ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో చదవడం, రాయడం, మాట్లాడడం తప్పనిసరిగా నేర్పాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల కోసం ప్రభుత్వం సకల సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. జిల్లాలో కొత్తగా 270 మంది టీచర్లను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పిల్లలకు చదువుపై ఆసక్తి కలిగేలా కథలు, ఇతర అంశాల రూపంలో ఆకర్షించేలా బోధన చేపట్టాలన్నారు. అనంతరం సైన్స్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆవిష్కరణలను పరిశీలించారు.

ఆఫీసర్లు బాధ్యతాయుతంగా డ్యూటీలు చేయాలి

కోల్​బెల్ట్, వెలుగు: ప్రభుత్వ అధికారులు, ఉద్యో గులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం ఆయన మందమర్రి మండలంలో పర్యటించారు. తహసీల్దార్ ఆఫీస్​ను సందర్శించి రిజిస్టర్లు, రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం కేజీబీవీలో కిచెన్ షెడ్, మధ్యాహ్న భోజనం క్వాలిటీ, రిజిస్టర్లు, స్కూల్​పరిసరాలు, వెంకటాపూర్ గ్రామంలో విద్యుత్​సబ్​స్టేషన్​ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. 

నర్సరీలో మొక్కల సంరక్షణపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివిధ సేవల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, విధులు బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు. జాతీయ రహదారి విస్తరణ పనులు, వివిధ సర్టిఫికెట్లను నిబంధనల ప్రకారం పరిశీలించాలని ఆదేశించారు. తహసీల్దార్​ సతీశ్, ఆఫీసర్లు పాల్గొన్నారు.