
హైదరాబాద్, వెలుగు: గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల కేసులో నిందితుడు రామేంద్ర కుమార్ రవికి హైకోర్టు గురువారం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బిహార్‌కు చెందిన సివిల్ ఇంజనీర్ అయిన రామేంద్ర కుమార్ రవి.. ఈ కేసులో అరెస్టయిన బత్తుల ప్రభాకర్‌కు తుపాకీలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 2025 ఫిబ్రవరి 1న గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో బత్తుల ప్రభాకర్.. సైబరాబాద్ సీసీఎస్ పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్, బౌన్సర్ కు గాయాలయ్యాయి.
దాదాపు 80 క్రిమినల్ కేసుల్లో నిందితుడైన ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతను బిహార్ నుంచే తుపాకీలను సేకరించినట్లు తేలింది. దీంతో రామేంద్ర కుమార్ రవిని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. రామేంద్ర కుమార్ రవి తనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని గ్రహించి..హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. జస్టిస్ శ్రీనివాసరావు ఈ పిటిషన్‌ను విచారించి, షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.