
హైదరాబాద్, వెలుగు: హుజూర్‌నగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన మూడు కేసుల్లో ఒక కేసును హైకోర్టు కొట్టివేసింది. మిగిలిన రెండు కేసుల్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేందుకు మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ప్రతివాదులు తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన భార్య పద్మావతి రెడ్డికి మద్దతుగా 2019 హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ప్రచారం చేస్తూ.. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.
అనుమతి లేకుండా రోడ్‌షో నిర్వహించడం, మఠంపల్లి చౌరస్తాలో భారీ జన సమీకరణ సమావేశంలో ప్రసంగించడం వంటి కారణాలతో నేరేడుచర్ల, మఠంపల్లి పోలీస్ స్టేషన్‌లలో ఆయనపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను రాజకీయ కక్షతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నమోదు చేసిందని ఉత్తమ్‌కుమార్ హైకోర్టులో సవాలు చేశారు. దాంతో నేరేడుచర్లలో నమోదైన ఒక కేసును హైకోర్టు కొట్టివేయగా.. మిగిలిన రెండు కేసులపై విచారణ కొనసాగనుంది.