కామారెడ్డి ని ఆదుకునేందుకు సినీ పరిశ్రమ ముందుకు రావాలి: విజయశాంతి

కామారెడ్డి ని ఆదుకునేందుకు సినీ పరిశ్రమ ముందుకు రావాలి: విజయశాంతి

కామారెడ్డి పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందన్నారు ఎమ్మెల్సీ విజయశాంతి.  ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ తో కలిసి కామారెడ్డిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు విజయశాంతి . ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రజల పరిస్థితిని చూస్తే బాధేస్తోందన్నారు. కామారెడ్డిని ఆదుకునేందుకు సినీ పరిశ్రమ ముందుకు వచ్చి సాయం చేయాలన్నారు .  

మానవత్వంతో  తమ ప్రభుత్వం బాధితులను ఆదుకుంటుందన్నారు విజయశాంతి.  తెలంగాణ లో 8 మంది ఎంపీలు ,ఎమ్మెల్యేలను  గెలిపిస్తే బీజేపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు . ప్రజలు కష్టాల్లో బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు.? బీజేపీకి అసలు సిగ్గు ఉందా? అని మండిపడ్డారు. కామారెడ్డికి  కేంద్రం భారీ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.కామారెడ్డి ఎమ్మెల్యే  ఎక్కడా కనిపించడం లేదన్నారు. 

ఎమ్మెల్యే వ్యాఖ్యలు బాధాకరం 

 కామారెడ్డికి ఈ స్థాయి కష్టం వస్తుందని ఊహించలేదన్నారు అద్దంకి దయాకర్ . క్లౌడ్ బరస్ట్ ఉత్తర తెలంగాణ కు చాలా ఇబ్బందిగా మారిందన్నారు.  స్థానిక బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి కామారెడ్డి ప్రజలను దోషులుగా చూస్తున్నారని..  ఆయన వ్యాఖ్యలు బాధాకరమన్నారు.  కేంద్రాన్ని 10 వేల కోట్ల వరద సహాయం  అడిగామని.. కేంద్రం  ఇవ్వకున్నా కామారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.  కామారెడ్డి వరదల్లో ఉంటే బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందన్నారు.  నష్టంపై  కమిటి అంచనా వేసి విపత్తు అంశం శాసనసభ,మండలిలో చర్చిస్తామని చెప్పారు అద్దంకి దయాకర్.  ముఖ్యమంత్రిని కలిసి కామారెడ్డి బాధను విన్నవిస్తామన్నారు. కామారెడ్డి ఎల్లారెడ్డి, జుక్కల్ ప్రాంతాలను కూడా సందర్శిస్తామని చెప్పారు. 

ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు తెలంగాణలో 2 లక్షల 20 వేల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా.. కామారెడ్డి జిల్లాలో దాదాపు 77 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అత్యధికంగా వరి, పత్తి, ఇతర పంటలు నష్టపోయాయని తెలిపింది.