మెడికల్‌ కౌన్సెలింగ్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

మెడికల్‌ కౌన్సెలింగ్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

తెలంగాణ రాష్ట్రంలో మెడికల్‌ కౌన్సెలింగ్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. MBBS,BDS రెండో విడత కౌన్సెలింగ్‌పై దాఖలైన పిటిష్లను కోర్టు కొట్టివేసింది.SC,ST,BC రిజర్వేషన్ల అమలులో నిబంధనలు పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్లను  రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది.

ఇప్పటికే మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తవ్వగా.. రెండో విడత ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. సీట్ల కేటాయింపులో మొదట రిజర్వేషన్‌ కోటా సీట్లను భర్తీ చేసిన తర్వాత ఓపెన్‌ కేటగిరీ సీట్లను భర్తీ చేస్తున్నారని,  దీంతో విద్యార్థులకు అన్యాయం జరగుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ముందుగా ఓపెన్‌ కేటగిరీ సీట్లను భర్తీ చేసిన తర్వాతే  రిజర్వేషన్ సీట్లను భర్తీ చేయాలని కోరారు. నియామక ప్రక్రియను నిర్వహిస్తున్న కాళోజీ విశ్వవిద్యాలయం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పిటిషన్‌లో తెలిపారు.

దీనిపై గతంలో విచారణ చేపట్టిన కోర్టు రెండో విడత కౌన్సిలింగ్‌పై స్టే విధించింది. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తుదితీర్పు వెల్లడించింది. కాళోజీ విశ్వవిద్యాలయం వాదనలు విన్న న్యాయస్థానం.. తాము కౌన్సిలింగ్‌ ప్రక్రియలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. సెప్టెంబర్‌ 1 నుంచి తరగతులు ప్రారంభం కానుండటంతో జోక్యం చేసుకోవడం సరికాదని అభిప్రాయపడింది. దీంతో రెండో విడత ప్రక్రియకు మార్గం సుగమమైంది.త్వరలోనే కాళోజీ వర్సిటీ అధికారులు కౌన్సిలింగ్‌కు సంబంధించిన రీషెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు.