సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కాలరీస్‌‌ కార్మిక గుర్తింపు సంఘ ఎన్నికలు షెడ్యూల్‌‌ ప్రకారం జరగాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ సింగరేణి యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌‌ను డిస్మిస్‌‌ చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ జారీ చేసిన షెడ్యూల్‌‌ ప్రకారం ఎన్నికలను ఈ నెల 27న నిర్వహించాలని తీర్పు చెప్పింది. ఈ మేరకు చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ జె.అనిల్‌‌ కుమార్‌‌ల డివిజన్‌‌ బెంచ్‌‌ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 

కేంద్ర కార్మిక శాఖ ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసి ఎన్నికల షెడ్యూల్‌‌ను కూడా ప్రకటించిందని, ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయని, ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్‌‌ ప్రకారం ఓటర్ల జాబితా రెడీ చేయడంతోపాటు నామినేషన్ల ప్రక్రియ కూడా జరిగిందని, గతంలో ఆదేశించిన మేరకు ఈ నెల 27 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించింది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ యాజమాన్యం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌‌ను కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.