నేటి బీజేపీ మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

నేటి బీజేపీ మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
  • నేటి బీజేపీ మహా ధర్నాకు
  • హైకోర్టు గ్రీన్ సిగ్నల్
  • నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్న కోర్టు 
  • ధర్నా చౌక్‌లో కాకపోతే ప్రజలు ఎక్కడ నిరసన తెలపాలని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీకి నిరసనగా ‘మా నౌకర్లుమాగ్గావాలె’ నినాదంతో శనివారం బీజేపీ తలపెట్టిన మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరసన చేపట్టవచ్చని స్పష్టం చేసింది. ధర్నాలో 500 మందికి మించరాదని, ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలు చేయరాదని షరతులు విధించింది. ధర్నాలో పాల్గొనే బీజేపీ ముఖ్య నేతల వివరాలను శుక్రవారం రాత్రి 9 గంటల వరకు పోలీసులకు అందజేయాలని సూచించింది.

ధర్నాకు అవసరమైన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. టీఎస్‌‌‌‌ పీఎస్సీ పేపర్ల లీకేజీకి నిరసనగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ఈ నెల 25న ధర్నా చౌక్‌‌‌‌ వద్ద మహా ధర్నా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ధర్నాకు పర్మిషన్‌‌‌‌ ఇవ్వాలని పోలీసులకు దరఖాస్తు చేసుకోగా,శుక్రవారం మధ్యాహ్నం వరకు వారు స్పందించలేదు. దీంతో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌‌‌‌రెడ్డి హైకోర్టులో లంచ్‌‌‌‌ మోషన్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిని జస్టిస్‌‌‌‌ విజయ్‌‌‌‌సేన్‌‌‌‌ రెడ్డి విచారణ చేపట్టారు. రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ ధర్నా చేస్తున్నదని ప్రభుత్వ  తరఫు లాయర్‌‌‌‌‌‌‌‌ వాదించారు. పేపర్ల లీకేజీ విషయంలో బీజేపీ స్టేట్‌‌‌‌ చీఫ్‌‌‌‌ బండి సంజయ్‌‌‌‌కి సిట్‌‌‌‌ నోటీసులిచ్చిందని, అయితే, ఆయన విచారణకు సహకరించడం లేదన్నారు. కోర్టు స్పందిస్తూ.. పేపర్ల లీకేజీపై రాజకీయ పార్టీలు నిరసనలు తెలపకూడదని ఎక్కడా లేదు కదా అని ప్రశ్నించింది. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని చెప్పింది. ధర్నా చౌక్‌‌‌‌లో అనుమతి ఇవ్వకుంటే ప్రజలు ఎక్కడ ధర్నా చేసుకుంటారని ప్రశ్నిస్తూ, షరతులతో ధర్నాకు అనుమతి ఇచ్చింది. 
ధర్నా చౌక్‌‌‌‌ వద్ద ఏర్పాట్ల పరిశీలన..
మహా ధర్నాను సక్సెస్ చేసేందుకు బీజేపీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నది. శుక్రవారం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు తదితరులు ఇందిరా పార్క్‌‌‌‌ వద్దకు వెళ్లి సభ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, పార్టీ నాయకులు, స్టూడెంట్లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీజేపీ నేతలు కోరారు. పార్టీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, 
ఎమ్మెల్సీలు, జాతీయ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొననున్నారు.