ఫాం హౌస్ నిందితుల రిమాండ్కు అనుమతించిన హైకోర్టు

ఫాం హౌస్ నిందితుల రిమాండ్కు అనుమతించిన హైకోర్టు

ఫాంహౌస్ కేసు నిందితుల రిమాండ్ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ అప్పీల్ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం వారి రిమాండ్కు అనుమతించింది. ముగ్గురు నిందితులను 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీసులు కాసేపట్లో నిందితుల్ని అదుపులోకి తీసుకోనున్నారు. 

నిందితులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, వారు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. తీవ్ర ఆరోపణలు ఉన్న కేసులో సీఆర్పీసీ 41(ఏ) నోటీసు ఇవ్వాల్సిన అవసరంలేదని న్యాయమూర్తికి విన్నవించారు. అయితే నిందితుల తరఫు న్యాయవాది మాత్రం ఘటనా స్థలంలో ఎలాంటి మెటీరియల్ ఎవిడెన్స్ దొరకలేదని, 41(ఏ) నోటీసు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని కోర్టుకు విన్నవించారు. ఏసీబీ ఓల్డ్ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారని, అయితే ఆ చట్టం ప్రకారం సీబీఐ అధికారులే దర్యాప్తు చేయాల్సి ఉంటుందని వాదించారు. ఏసీబీ చేయాల్సిన పనిని కూడా పోలీసులే చేశారని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ 41(ఏ) నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదన్న ప్రభుత్వ న్యాయవాది వాదనతో ఏకీభవించారు. 24 గంటల్లోగా నిందితులను కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించారంటూ నందకుమార్,  సింహయాజులు, రామచంద్ర భారతిలను అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచారు. అయితే మెటీరియల్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయని కారణంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి రిమాండ్ రిపోర్టును తిరస్కరించారు. నిందితులను విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో సైబరాబాద్ పోలీసులు నిన్న హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టును రిమాండ్ కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.