ఆమనగల్లు, వెలుగు : రంగారెడ్డి జిల్లా మాడ్గుల్ మండలం నర్సంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నర్సంపల్లి గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో గ్రామానికి చెందిన సోనా హనుమనాయక్ ఈ నెల 4న నామినేషన్ వేసేందుకు వెళ్లగా.. ఓటర్ లిస్ట్‌లో పేరు లేదంటూ ఆఫీసర్లు తీసుకోలేదు. దీంతో అదే రోజుహైకోర్టును ఆశ్రయించగా.. సోనా హనుమనాయక్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.
తిరిగి నామినేషన్ వేసేందుకు వెళ్లినా అదే పరిస్థితి ఎదురవడంతో 5వ తేదీన మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపిన కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నర్సంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. సోనా హనుమనాయక్ మాట్లాడుతూ... 2019లో తనకు ఓటు ఉన్నప్పటికీ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా తన ఓటు పక్క గ్రామమైన ఇర్విన్‌లో, తన కూతురు ఓటు కలకొండలో నమోదైందన్నారు.
ఈ విషయాన్ని 2024లోనే గమనించి తన ఓటును నర్సంపల్లికి మార్పించుకొని, ఆన్‌లైన్‌లో ఓటర్ కార్డు తీసుకొని నామినేషన్ వేసేందుకు వెళ్తే.. లిస్ట్‌లో పేరు లేదంటూ ఆఫీసర్లు నామినేషన్ తీసుకోలేదని ఆరోపించారు.
