రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చెపట్టింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సల ధరలు ఒకే విధంగా ఉండాలన్న ఆదేశాలు అమలు చేశారా అంటూ సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ప్రశ్నించింది. మా ఆదేశాల్లో కొన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేకాదు..ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సల గరిష్ట ధరల సవరిస్తూ తాజా జీవో ఇచ్చారా?..కరోనా పై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ..14 కొత్త ఆర్ టీపీసీఆర్ లేబొరేటరీలు ఇంకా ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?..మరికొన్ని ఆదేశాలు అమలు చేశారో లేదో నివేదికలో వివరించలేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. అంతేకాదు థర్డ్ వేవ్ సన్నద్ధతపై వివరాలు సమగ్రంగా లేవని కూడా అంది.

మహారాష్ట్రలో ఒకే జిల్లాలో 8 వేల మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారని..తెలంగాణలో అన్నీ భవిష్యత్తు లోనే చేస్తారా?.. ఇప్పుడేమీ చేయడం లేదా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది హైకోర్టు. అంతేకాదు  చిన్నారుల కోసం నిలోఫర్ ఆస్పత్రి ఒక్కటే సరిపోతుందా? అని అడిగింది. మౌలిక సదుపాయాలు, సిబ్బంది పెంపునకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంది. లైసెన్సు రద్దు చేసిన ఆస్పత్రులకు బాధితులు చెల్లించిన సొమ్ము తిరిగి ఇచ్చారో లేదో చెప్పాలంది. బంగారం తాకట్టు పెట్టి ఆస్పత్రులకు ఫీజులు చెల్లిస్తున్నారంది హైకోర్టు.

హైకోర్టు ప్రశ్నలకు వివరణ ఇచ్చారు ఏజీ బీఎస్ ప్రసాద్. డీహెచ్ ఖమ్మం వెళ్లినందున విచారణకు హాజరు కాలేదన్నారు. హైకోర్టు ప్రశ్నలకు వివరాలు అడిగి తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలన్నారు. కేటాయించిన బ్లాక్ ఫంగస్ ఔషధాలు ఎందుకు సరఫరా చేయలేదో తెలపాలని కేంద్రానికి ఆదేశం జారీ చేసిన హైకోర్టు.. కరోనా పరిస్థితులపై విచారణ రేపటికి వాయిదా వేసింది.