హైడ్రా కమిషనర్‌‌‌‌‌‌‌‌కు హైకోర్టు రూ.50 వేల జరిమానా!

హైడ్రా కమిషనర్‌‌‌‌‌‌‌‌కు హైకోర్టు రూ.50 వేల జరిమానా!
  •     ఫైన్ చెల్లిస్తేనే కౌంటర్‌‌‌‌‌‌‌‌ స్వీకరించాలని రిజిస్ట్రీకి ఆదేశం
  •     కోర్టు ఉత్తర్వులున్నా యూసుఫ్‌‌‌‌‌‌‌‌గూడలో ప్రహరీగోడ కూల్చివేతపై ఆగ్రహం
  •     విచారణను ఈనెల 15కు వాయిదా వేసిన న్యాయమూర్తి

హైదరాబాద్, వెలుగు: నగరంలోని యూసుఫ్‌‌‌‌‌‌‌‌గూడలో సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌ 45లోని రెండు ఎకరాల భూమి వ్యవహారంలో కౌంటర్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయని హైడ్రా కమిషనర్‌‌‌‌‌‌‌‌కు హైకోర్టు రూ.50 వేలు జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ రిలీఫ్‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌కు జమ చేయాలని, జరిమానా చెల్లించిన తర్వాతే కౌంటర్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను స్వీకరించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను ఈ నెల 15కు వాయిదా వేస్తూ జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌.వి. శ్రవణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ ఇటీవల ఉత్తర్వులు వెలువరించారు.

కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రహరీని హైడ్రా కూల్చివేసిందని మహమ్మద్‌‌‌‌‌‌‌‌ షఫహతుల్లా అనే పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో కౌంటరు దాఖలు చేయాలని గడువు ఇచ్చినా దాఖలు చేయకపోవడంపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. హైడ్రా న్యాయవాది స్పందిస్తూ కౌంటరు సమర్పించామని చెప్పగా, సాంకేతిక కారణాలతో రిజిస్ట్రీ దానిని తిరస్కరించిందని, ఈ వ్యవహారంలో ఒక్క కౌంటర్‌‌‌‌‌‌‌‌ కూడా దాఖలు కాలేదని తెలుసుకున్న న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 2008 మార్చి 15నుంచి ఈ భూమి తమ స్వాధీనంలోనే ఉందని పిటిషనర్‌‌‌‌‌‌‌‌ న్యాయవాది వాదించారు. గతంలో హైకోర్టు యథాతథ స్థితి (స్టేటస్‌‌‌‌‌‌‌‌కో) ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, గత మార్చి 18న హైడ్రా అధికారులు పోలీసుల సహాయంతో ప్రహరీ గోడను కూల్చివేసి ముళ్లకంచె వేశారన్నారు.  ‘ఆ స్థలం హౌసింగ్‌‌‌‌‌‌‌‌ బోర్డు ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ హౌసింగ్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌కు చెందిన బహిరంగ ప్రదేశం' అని బోర్డులు పెట్టారని, కోర్టు ఆదేశాల గురించి తెలిసినా హైడ్రా పట్టించుకోవడం లేదని పిటిషనర్ న్యాయవాది నివేదించారు.