ఆర్టీసీకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చినం: సర్కారు

ఆర్టీసీకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చినం: సర్కారు

ఆర్టీసీకి జీహెచ్ఎంసీ నుంచి ఇవ్వాల్సిన బకాయిలేవీ లేవని, ఆర్టీసీ నష్టాలను జీహెచ్ఎంసీ భరించాల్సిన అవసరమే లేదని సర్కారు, జీహెచ్ఎంసీ హైకోర్టులో కౌంటర్లు దాఖలు చేశాయి. తాము ఏటా ఆర్టీసీకి ఆర్థికంగా అండగా ఉంటున్నామని, ఆర్టీసీయే సర్కారుకు పన్నుల బకాయిలు ఉందని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొనగా.. జీహెచ్ఎంసీలో మిగులు బడ్జెట్​ ఉన్నప్పుడు ఆర్టీసీకి నిధులు ఇచ్చామని, తర్వాత ఆర్థిక లోటుతో సాయం చేయలేకపోయామని జీహెచ్ఎంసీ కమిషనర్​ చెప్పారు. సర్కారు నుంచిగానీ, జీహెచ్ఎంసీ నుంచిగానీ రావాల్సిన బకాయిలేవీ లేవంటూ ఆర్టీసీ ఇన్​చార్జి ఎండీ సునీల్​శర్మ విడిగా మరో కౌంటర్​ దాఖలు చేశారు.

ముగ్గురి కౌంటర్లూ ఒకేలా..!

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలేమీ లేవని సర్కారు ఇటీవలి విచారణలో  చెప్పింది. ఆ లెక్కలపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. ఆర్టీసీకి ఎంత రావాల్సి ఉంది, ఎంత ఇచ్చారన్న సరైన వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు బుధవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్​కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. ఈ మూడు కౌంటర్లూ దాదాపు ఒకే తరహాలో ఉన్నాయి. ఎలాంటి బకాయిలూ లేవన్న వాదనను సమర్థించేలా వివరాలను పేర్కొన్నారు. అయితే గతంలో చెప్పిన వాదనలతోనే మళ్లీ కౌంటర్లు వేయడం విశేషం.

ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చినం: సర్కారు

సర్కారు ఆర్టీసీకి ఆర్థికంగా అండగానే నిలుస్తోందని, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ప్రభుత్వ కౌంటర్​లో పేర్కొన్నారు. ‘‘2014–15 నుంచి 2017–18 వరకు ఆర్టీసీకి వివిధ పద్దుల కింద రూ.2,786 కోట్లు ఇచ్చినం. 2018–19లో రూ.662.39 కోట్లు, 2019–20లో రూ.455 కోట్లు ఇచ్చినం. ఎంవీ ట్యాక్స్‌ కింద ఆర్టీసీ నుంచే సర్కార్‌కు రూ.540.16 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. ఆర్టీసీకి రాష్ట్రం రుణం ఇవ్వడమేగానీ ఏనాడూ ఆ అప్పును ఆర్టీసీ తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయలేదు. తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లించాలని కూడా షరతు పెట్టలేదు. వివిధ రాయితీల సొమ్మును కూడా చెల్లించేశాం. ఆర్టీసీలో పెట్టుబడుల కోసం రూ.1,219 కోట్లు, రుణం కింద రూ.1,294 కోట్లు, బస్సుల్ని కొనేందుకు రుణంగా రూ.160 కోట్లు, రాయితీల నిమిత్తం రూ.1,230 కోట్లు.. ఇలా మొత్తం రూ.3,903 కోట్లు ఇచ్చాం. ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ ఇవ్వాల్సిన సొమ్మునూ సర్కారే చెల్లించేసింది. జీహెచ్‌ఎంసీ రూ.1,492 కోట్లు చెల్లించాలని ఆర్టీసీ కోరుతోందని మాత్రమే చెప్పాం, జీహెచ్‌ఎంసీ చెల్లించాలని చెప్పలేదు..” అని వివరించారు.

మిగులు బడ్జెట్​ ఉంటే ఇచ్చినం: జీహెచ్ఎంసీ

ఆర్టీసీ నష్టాలను జీహెచ్‌ఎంసీ భరించడం కష్టమని జీహెచ్ఎంసీ కమిషనర్​ దాఖలు చేసిన కౌంటర్​లో పేర్కొన్నారు. ‘‘చట్టప్రకారం ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ డబ్బులు చెల్లించాల్సిన అవసరమే లేదు. 2016 మే వరకు ఆర్టీసీకి రూ.138 కోట్లు ఇచ్చినం. మిగులు బడ్జెట్​ ఉన్నందున మరో రూ.198 కోట్లు ఇచ్చినం. 2016 అక్టోబర్‌ నుంచి లోటులో ఉండడంతో చెల్లించలేమని చెప్పాం” అని వివరించారు.

ఎలాంటి బకాయిలూ లేవు: ఆర్టీసీ ఎండీ

ఆర్టీసీ ఆర్థిక పరిస్థితులపై ఈ ఏడాది అక్టోబర్‌ 11న ఇంటర్నల్‌ రిపోర్టు ఇచ్చామని, సర్కారు నుంచి, ఇతర సంస్థల నుంచి ఆర్టీసీకీ నిధులు వచ్చేలా చేయాలని మంత్రిని కోరామని ఆర్టీసీ ఇన్​చార్జి ఎండీ తన కౌంటర్​లో పేర్కొన్నారు. ‘‘రాయితీల కింద రూ.3,006 కోట్లు రావాల్సి ఉంటే.. సర్కార్‌ నుంచి ఆర్టీసీ రూ.3,903 కోట్లు అందుకుంది. అంటే రూ.897 కోట్లు అదనంగా ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో సిటీ బస్సుల్ని నడపడం వల్ల వచ్చే నష్టాలు, అందుకు జీహెచ్‌ఎంసీ చెల్లింపుల వ్యవహారంపైనా మంత్రికి తెలియజేశాం. నిజానికి జీహెచ్‌ఎంసీ ఎటువంటి బకాయిలు చెల్లించాల్సివి లేవు. మంత్రికి విన్నవించిన లెక్కల్లో రూ.840 కోట్ల తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని నిధుల గురించి కూడా సమాచారం ఉంది” అని కౌంటర్​లో వివరించారు.