
- బ్రెయిన్ హెల్త్పై శ్రద్ధ చూపడం లేదు: న్యూరాలజిస్టులు
- చిరాకు, నిద్రలేమి, మరిచిపోవడాన్ని నిర్లక్ష్యం చేయరాదు
- వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా కేర్ డాక్టర్ల హెచ్చరిక
- లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలని సూచన
గచ్చిబౌలి, వెలుగు: ప్రస్తుత మనిషి జీవనశైలి, పని ఒత్తిడి కారణంగా మెదడుకి సంబంధించిన సమస్యలు తీవ్రమవుతున్నాయని న్యూరాలజిస్టులు అన్నారు. ఇతర ఆరోగ్య సమస్యలపై చూపుతున్న శ్రద్ధ.. మెదడు ఆరోగ్యంపై చూపడం లేదని తెలిపారు. జులై 22న వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా హైటెక్ సిటీలోని కేర్ డాక్టర్లు ఒక ప్రకటన విడుదల చేశారు. మెదడు సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించాలని, జీవనశైలిలో మార్పులు చేసుకోకపోతే ముప్పు తప్పదంటున్నారు.
మెదడుకి వచ్చే వ్యాధులంటే స్ట్రోక్, క్యాన్సర్ మాత్రమే కాదని.. ఒత్తిడి, మానసిక అలసట, డిజిటల్ ఓవర్‌లోడ్ వంటివి కూడా అలాంటివేనని కేర్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కైలాశ్ మిర్చే స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగ జీవితం గడిపే వారిని మెదడు సంబంధిత సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయని ఆయన చెప్పారు. ఫోకస్ లోపం, చిరాకు, నిద్రలేమి, మరిచిపోవడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేస్తుంటారని, వీటిని హెచ్చరికలుగా భావించాలన్నారు.
ఒత్తిడికి గురయ్యే వాతావరణం, నిరంతరం స్క్రీన్ చూడడం, విశ్రాంతి లేకపోవడం మెదడును చెడు దిశలో మలుస్తున్నాయన్నారు. 30 ఏళ్లలోపు వారిలోనూ మెదడు సంబంధిత సమస్యలు వస్తున్నాయని తెలిపారు. మనిషి జీవనశైలి, ఒత్తిడే దీనికి ముఖ్య కారణమని పేర్కొన్నారు. రోజూ 7 నుంచి 8 గంటల పాటు నాణ్యమైన నిద్రపోవడం చాలా ముఖ్యమని, ఇది మెదడుకి ఎంతో మేలు చేస్తుందన్నారు. ‘‘బీ -విటమిన్లు, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం మెదడుకు మంచిది. అలాగే, డిజిటల్ హైజీన్‌ను కూడా పాటించాలి. ఎక్కువగా స్క్రీన్ చూసే అలవాటు ఫోకస్‌ను దెబ్బతీస్తుంది” అని డాక్టర్ కైలాస్ వివరించారు.
చిన్న పిల్లల స్క్రీన్ టైంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చిన్నపిల్లల స్క్రీన్ టైంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డాక్టర్ కైలాశ్ సూచించారు. ప్రాథమిక దశలోనే మెదడు అభివృద్ధి జరుగుతుందని, ఈ దశలో స్క్రీన్ ఎక్కువగా చూసినట్లయితే, పిల్లల్లో భావోద్వేగ నియంత్రణ, దృష్టి వ్యవధి, మాట్లాడే నైపుణ్యాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించారు. వాల్ నట్స్, ఫ్యాటీ ఫిష్, బెర్రీస్, ఆకుకూరలు వంటి ఆహార పదార్థాలు మెదడు ఆరోగ్యానికి చాలా మంచివన్నారు.