మోడల్ మార్కెట్ను సంక్రాంతి నాటికి ప్రారంభిస్తాం : మంత్రి తుమ్మల

మోడల్ మార్కెట్ను సంక్రాంతి నాటికి ప్రారంభిస్తాం : మంత్రి తుమ్మల

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మంలో 15.39 ఎకరాల్లో 155.03 కోట్లతో నిర్మిస్తున్న వ్యవసాయ మోడల్ మార్కెట్‌ను  సంక్రాంతి కానుకగా ప్రారంభిస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మం వ్యవసాయ మోడల్ మార్కెట్ ఆధునికీకరణ పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం మార్కెట్ ఆవరణలో మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చే పంట ఉత్పత్తులకు ఎండ, వాన నుంచి రక్షణకు  7 షెడ్లు నిర్మిస్తున్నామన్నారు.  రేటు లేనప్పుడు పంట ఉత్పత్తులను భద్రపర్చుకునేందుకు కోల్డ్ స్టోరేజ్‌ నిర్మిస్తున్నట్లు మంత్రి చెప్పారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా మోడల్ మార్కెట్ డిజైన్ చేసినట్లు చెప్పారు.

మార్కెట్‌కు  భారీ వాహనాలు వచ్చేలా రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు మార్కెట్‌ చుట్టూ ఉన్న 332 మంది పేదల గుడిసెలు తొలగించి వారికి వేరేచోట 10 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఆర్డీవోను ఆదేశించారు. మంత్రి వెంట ఏఎంసీ చైర్మన్‌ ఎరగర్ల హన్మంతరావు, అడిషనల్ డైరెక్టర్ రవికుమార్, శ్రీనివాస్, ఇంజనీర్ సురేశ్, మేయర్ నీరజ, ఆర్డీవో నరసింహారావు, డీసీసీబీ చైర్మన్ వెంకటేశ్వరరావు, డీఎంవో అలీం, వ్యవసాయ మార్కెట్ గ్రేడ్ వన్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.  

24న మంచుకొండ ప్రాజెక్ట్  ట్రయిల్ రన్   

రఘునాథపాలెం మండలం మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ట్రయిల్ రన్ నిర్వహించి చెరువులను నింపేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న పనులన్నింటిని సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. లిఫ్ట్‌ ఇరిగేషన్ వద్ద  సబ్‌స్టేషన్  నిర్మాణం కోసం వెంటనే టెండర్​ పనులు ప్రారంభించాలని విద్యుత్ శాఖ సీఎండీ వరుణ్ రెడ్డికి సూచించారు.

ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై కొదుమూరు గ్రామం వద్ద ఉన్న హై టెన్షన్ లైన్ ను తక్షణమే మార్చాలని ట్రాన్స్కో అధికారులకు సూచించారు. వెలుగుమట్ల అర్బన్ పార్క్​లో వన్యప్రాణులకు తాగునీరు, నర్సరీ మొక్కలకు నీటిని అందించేందుకు కొదుమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి వెలుగుమట్ల అర్బన్ పార్క్ వరకు పైప్ లైన్లు వేయాలన్నారు. ఖమ్మం సిటీలో రహదారులను విస్తరించాలని అధికారులను ఆదేశించారు.