హైదరాబాద్లో శంకర్ పల్లి, శంషాబాద్, గండిపేట వైపు ఉంటున్నోళ్లకు ముఖ్య గమనిక

హైదరాబాద్లో శంకర్ పల్లి, శంషాబాద్, గండిపేట వైపు ఉంటున్నోళ్లకు ముఖ్య గమనిక
  • జంట జలాశయాలకు కాలుష్య ముప్పు ! 
  • పెరుగుతున్న పట్టణీకరణే కారణం
  • తప్పించేందుకు 4 ఎస్టీపీల నిర్మాణం
  • రూ. 82.23 కోట్ల ఖర్చు చేయనున్న వాటర్​ బోర్డు

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తరిస్తున్న క్రమంలో శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ భారీగా పెరిగింది. ఇది జంట జలాశయాలైన ఉస్మాన్​సాగర్​, హిమాయత్​ సాగర్​ల కు ముప్పుగా పరిణమించింది. ముఖ్యంగా శంకర్​పల్లి, శంషాబాద్​, గండిపేట, హిమాయత్​ సాగర్ ​తదితర ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు పెరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఫామ్​హౌస్​లు, విల్లాలు, ఇండ్ల నిర్మాణంతో పాటు పరిశ్రమలు, విద్యాసంస్థలు, హోటళ్లు​ ఏర్పడుతున్నాయి.

కొత్వాల్ గూడ, కవ్వగూడ, శంషాబాద్, నాగిరెడ్డి గూడ, అజీజ్​నగర్, శంకర్​పల్లి, మొయినాబాద్, జన్వాడ, మీర్జా గూడ, మియా ఖాన్ గడ్డ తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో కాలనీలు, బస్తీలు వెలుస్తున్నాయి. అయితే, ఈ ప్రాంతాల నుంచి వచ్చే మురుగు జంట జలాశయాల్లో కలిసే అవకాశం ఉండడంతో వాటర్​బోర్డు అలర్టయ్యింది. మురుగు కలవకుండా ఆయా ప్రాంతాల్లో ఎస్టీపీలు నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవల ఎస్టీపీలను పనులను కూడా అధికారులు ప్రారంభించారు. పరివాహక ప్రాంతాల్లోని ఇండ్లు, హోటల్స్, విల్లాల నుంచి వచ్చే డ్రైనేజీని నాలుగు ఎస్టీపీల్లోకి మళ్లించి మురుగును శుద్ధి చేయనున్నారు. 

ఎక్కడెక్కడంటే..
రూ. 82.23 కోట్లతో కొత్వాల్ గూడ వద్ద  6 ఎంఎల్​డీ, నాగిరెడ్డిగూడ వద్ద 5 ఎంఎల్​డీ, హిమాయత్ నగర్ దగ్గర 5 ఎంఎల్​డీ, జన్వాడ వద్ద  4 ఎంఎల్​డీల కెపాసిటీతో ఎస్టీపీలను నిర్మించాలని డిసైడయ్యింది. ఈ సందర్భంగా కొత్వాల్ గూడ వద్ద నిర్మాణంలో ఉన్న ఎస్టీపీ పనులను  స్పీడప్​చేయాలని ఇటీవల అధికారులతో కలిసి పనుల పరిశీలనకు వచ్చిన ఎండీ అశోక్​రెడ్డి  ఆదేశించారు. ప్రభుత్వం ఎస్టీపీకి కేటాయించిన భూమి చుట్టూ ఫెన్సింగ్ చేసి, సరిహద్దులను సరిచూసుకోవాలని సూచించారు. అలాగే, 2050 వరకు ఉత్పన్నమయ్యే మురుగును అంచనా వేసి దానిని శుద్ధి చేయడానికి అవసరమయ్యే ఎస్టీపీల నిర్మాణం, తదితర అంశాలను అధ్యయనం చేయాలని సూచించారు.

మన్నెగూడ వద్ద నిర్మిస్తున్న మరో ఎస్టీపీ పనులను కూడా పరిశీలించారు. భవిష్యత్తులో నిర్మాణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున మరింత  మురుగు పెరిగితే జలాశయాలు కలుషితం అయ్యే అవకాశం ఉందని, దానిని నివారించడానికే నాలుగు ఎస్టీపీల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. ఈ ఎస్టీపీలను వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రేటర్​ పరిధిలోనూ, ఓఆర్ఆర్ లోపల100 శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా మెట్రోవాటర్​బోర్డు అధికారులు 31 కొత్త ఎస్టీపీల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది.అమృత్-2.0 పథకంలో భాగంగా మరో 39 ఎస్టీపీలను నిర్మాణానికి రూపకల్పన చేసింది.