పేదల పేరుతో పెద్దల కబ్జా.. 300 ఎకరాలను కాపాడిన హైడ్రా.. రూ.15 వేల కోట్ల ప్రభుత్వ స్థలం సేఫ్

పేదల పేరుతో పెద్దల కబ్జా.. 300 ఎకరాలను కాపాడిన హైడ్రా.. రూ.15 వేల కోట్ల ప్రభుత్వ స్థలం సేఫ్
  • రూ.15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్
  • గాజుల రామారంలో ఫైనాన్స్​కార్పొరేషన్​ స్థలానికి ఎసరు
  • 300 ఎకరాల్లో లేఅవుట్లు, ప్లాట్లు, షెడ్లు
  • ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపి
  • ఆక్రమణ జరిగిందని తేల్చిన హైడ్రా, కలెక్టర్​
  • భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు
  • అమ్మకానికి సిద్ధంగా ఉన్న వాటినే కూల్చామని  ప్రకటన

జీడిమెట్ల, వెలుగు: పేదల పేరుతో పెద్దలు చేస్తున్న భూ కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. మేడ్చల్ మల్కాజిగిరి ​జిల్లా కుత్బుల్లాపూర్​ నియోజకవర్గం గాజుల రామారంలోని ప్రభుత్వ భూమిలో వెలిసిన ఆక్రమణలను కూల్చివేసింది. సర్వే నెంబర్​ 307లో స్టేట్​ ఫైనాన్స్​ కార్పొరేషన్‌కు కేటాయించిన సుమారు 300 ఎకరాల స్థలంలో పేదల పేరుతో కొందరు కబ్జాదారులు, ప్రజాప్రతినిధులు.. వందల సంఖ్యలో లే అవుట్లు వేసి షెడ్లు వేయడంతోపాటు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఇదే స‌ర్వే నంబ‌ర్​ చుట్టూ క‌బ్జాలు జ‌ర‌గ‌గా.. ప్రగతినగర్​ వైపు ఏకంగా లే అవుట్లు, వెంచ‌ర్లు వేశారు. ఈ క్రమంలో కొద్ది రోజుల కింద సర్వే నెంబర్​307లో సుమారు రూ.15 వేల కోట్ల విలువ చేసే 300 ఎకరాలు కబ్జాకు గురైందని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి.

దీంతో మేడ్చల్ ​కలెక్టర్ మనుచౌదరి​ శనివారం ఫీల్డ్​ లెవెల్‌లో పర్యటించి, ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది నిజమేనని తేల్చారు. 60 నుంచి120 గజాల ప్లాట్లను చేసి నిరుపేదలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆదివారం ఉదయం నుంచే  భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా రంగంలోకి దిగి.. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం మొదలుపెట్టింది. 12 ఎక‌‌రాల్లో వెలిసిన వెంచ‌‌ర్‌‌తో పాటు 20 ఎక‌‌రాల మేర ఉన్న లే అవుట్‌‌ను తొల‌‌గించింది. ఇందులో టెంపరరీగా బడాబాబులు వేసిన షెడ్లు, ప్రహరీలు ఉన్నాయి. ఈ భూముల్లో రోడ్లు వేసుకోవడమే కాకుండా, క‌‌రెంటు క‌‌నెక్షన్లు కూడా తీసుకున్నారు. కాగా,  ఆక్రమణలు తొలగించిన హైడ్రా ఈ స్థలం చుట్టూ ఫెన్సింగ్ కూడా వేయడం స్టార్ట్​చేసింది.  

ఎవరికి వారు ఆక్రమించుకోవడం..అమ్మడం..
గాజుల‌‌రామారంలోని స‌‌ర్వే నంబ‌‌ర్లు 329/1, 342 లో ఉన్న ప్రభుత్వ భూమిని 60 గ‌‌జాలు, 120 గ‌‌జాల ప్లాట్ల చొప్పున పేదలే ల‌‌క్ష్యంగా పెట్టుకుని కొందరు రౌడీషీట‌‌ర్లు, లోకల్​ లీడర్లు కలిసి అమ్మేసుకున్నారు. జ‌‌గ‌‌ద్గిరిగుట్ట పీఎస్​పరిధిలో రౌడీషీట్ ఉన్న షేక్ అబిద్ ఏకంగా ల‌‌క్ష్మి ముర‌‌ళి హుస్సేన్ పేరుమీద ప్లాట్ల విక్రయాలు జరిపారు. అలాగే, బోడాసు శ్రీ‌‌నివాస్‌‌ (డాన్ సీను), యేసుబాబు, సయ్యద్​గౌస్​బాబు, మ‌‌నీశ్, దేవా ఇలా ఎవ‌‌రికి వారు స్థలాలను ఆక్రమించి ప్లాట్లుగా చేసి అమ్ముకున్నారు.

స్థానిక రెవెన్యూ అధికారులు కూడా వీరికి స‌‌హ‌‌క‌‌రించిన‌‌ట్టు స‌‌మాచారం. దీనిపై పూర్తి స్థాయిలో హైడ్రా విచార‌‌ణ చేప‌‌ట్టింది. అందులో ఆసక్తికర నిజాలు వెల్లడయ్యాయి. కబ్జాదారులు 60, 120 గ‌‌జాల చొప్పున స్థలాలను డివైడ్​చేసి ప్రహరీ కట్టడం, అందులో ఒక రూమ్​కట్టి దానికి కిరాయి లేకుండా ఒక కుటుంబానికి అద్దెకు ఇవ్వడం, కొనుగోలుదారుడు దొరికిన త‌‌ర్వాత వారికి ఆ ప్లాట్‌‌ను అమ్మేయ‌‌డం చేసేవారు. ఇలా సాగిపోయిన క‌‌బ్జాల‌‌కు హైడ్రా ఇప్పుడు చెక్​పెట్టింది.  

ఉమ్మడి ప్రభుత్వంలో కేటాయింపు స‌‌ర్వేనంబ‌‌ర్​307తో పాటు  పక్కనే ఉన్న స‌‌ర్వే నంబ‌‌ర్లలో 444 ఎక‌‌రాల‌‌కు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో స‌‌ర్వే నంబ‌‌రు 307లోనే 317 ఎక‌‌రాల ప్రభుత్వ భూమి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఫైనాన్స్ కార్పొరేష‌‌న్‌‌కు అప్పటి సర్కారు ఈ భూమిని అప్పగించింది. ఆ త‌‌ర్వాత రాష్ట్రం విడిపోవ‌‌డం..ఫైనాన్స్ కార్పొరేష‌‌న్‌‌కు  చెందిన ఆస్తుల పంప‌‌కాల్లో జ‌‌రిగిన జాప్యాన్ని ఆస‌‌రాగా తీసుకొని కబ్జాదారులు ఆక్రమణలకు పాల్పడ్డారు. ఈ విష‌‌య‌‌మై హైడ్రాకు స్థానికుల నుంచి ప్రజావాణి ద్వారా ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదుల మేర‌‌కు హైడ్రా స‌‌ర్వే నంబ‌‌ర్ల వారీగా విచార‌‌ణ‌‌ చేప‌‌ట్టింది. రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ, ఫైనాన్స్ కార్పొరేష‌‌న్ అధికారుల‌‌తో 5–6 సార్లు స‌‌మావేశం ఏర్పాటు చేసి.. పూర్తిస్థాయిలో విచార‌‌ణ జ‌‌రిపింది. 6 నెల‌‌లకు పైగా పూర్తిస్థాయిలో విచారించి చ‌‌ర్యలు తీసుకున్నది. 

250 ఇండ్లు నేలమట్టం 
ఉదయం 6 గంటలకు హైడ్రాతోపాటు బల్దియా, రెవెన్యూ, పోలీసులతో కలిపి సుమారు 300 మంది కూల్చివేతలకు వెళ్లారు.  సాయంత్రం 4 గంటల వరకు కూల్చివేతలు కొనసాగాయి. కొందరు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. పోలీసులు వారిని నిలువరించారు. ఈ సందర్భంగా తలుపులు, కిటికీలు లేనివి కొన్ని, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి మరికొన్ని, సామాన్లు పెట్టి మనుషులు లేని ఇండ్లు మరికొన్ని కలిపి మొత్తం 250 ఇండ్లను నేలమట్టం చేశారు. వీటితో పాటు షెడ్లు వేసి గోడౌన్లకు అద్దెకు ఇవ్వడానికి రెడీగా ఉన్న వాటిని కూడా కూల్చివేశారు. 

2023లో 2,500 అక్రమ నిర్మాణాలు 
2023లో 2,500 అక్రమ నిర్మాణాలు వెలిశాయని అప్పటి కలెక్టర్​అమోయ్‌‌ కుమార్​ తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి అప్పటి ఆర్ఐని సస్పెండ్​కూడా చేశారు. అయితే, తర్వాత అక్రమ నిర్మాణాలపై యాక్షన్​తీసుకోకపోవడంతో ఇండ్లు, షెడ్లు వెలుస్తూనే ఉన్నాయి. అప్పటి ప్రజాప్రతినిధి కబ్జాదారులకు అండగా నిలిచినట్టు ఆరోపణలున్నాయి. ఇక్కడ నిర్వహించే పలు కార్యక్రమాలకు కూడా వారు హాజరయ్యేవారని, దీంతో కబ్జాదారుల ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.  దీంతో ఇప్పుడు అక్కడ 5వేల వరకు అక్రమ నిర్మాణాలు వెలిశాయని తెలుస్తున్నది.

పేదల పేరుతో కబ్జాదారుల డ్రామా
పదేండ్ల కింద గత బీఆర్ఎస్ ​ప్రభుత్వ హయాంలో పేదల పేరుతో ప్రజాప్రతినిధులు, కబ్జాదారులు కుమ్మక్కై రియల్​ఎస్టేట్​వ్యాపారం మొదలుపెట్టారని కూల్చివేతల టైంలో అక్కడికి వచ్చిన పలువురు స్థానికులు ఆరోపించారు. ఈ సందర్భంగా కొందరు బాధితులు రూ.20 లక్షలకు కొన్నామని చెప్తున్నారని, అమ్మిన వారి పేరు చెప్పాలని అడిగితే మాట్లాడడం లేదన్నారు. దీన్ని బట్టి అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. మరికొందరు తాము కొనలేదని, ప్రభుత్వ భూమి అని రూమ్స్​వేసుకున్నామని చెప్తున్నారని, ఇదంతా చూస్తుంటే కొందరు వెనక ఉండి ఇదంతా నడిపిస్తున్నారని అర్థమవుతున్నదన్నారు. కబ్జాదారులు పేదలను ముందు పెట్టి పకడ్బందీ ప్లాన్‌‌తో రూ.వేల కోట్ల విలువచేసే భూములను కబ్జా చేశారని, వారిపై యాక్షన్​ తీసుకోవాలని డిమాండ్​చేస్తున్నారు.  

అధికారుల పైనా చర్యలకు డిమాండ్​
ప్రభుత్వ భూమిలో వందల ఎకరాల స్థలాన్ని బహిరంగంగా ఆక్రమిస్తుంటే ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు కబ్జాదారులకు అండగా ఉన్నారని, వారిపై యాక్షన్​తీసుకోవాలని కొందరు బాధితులు డిమాండ్​చేస్తున్నారు. రూమ్స్​కడుతున్నప్పుడే రెవెన్యూ ఆఫీసర్లు ఎందుకు అడ్డుకోలేదని, కరెంట్​శాఖ అధికారులు ఎలా మీటర్లు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఈ కబ్జాల దందా వెనక ఉన్నవారు ఎవరైనా గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేస్తున్నారు.  

హైడ్రా జేసీబీపై రాళ్లతో దాడి
భారీ పోలీసు బందోబస్తు మధ్య  అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి హైడ్రా రాగా,  కొందరు అడ్డుకున్నారు. తాము డబ్బులు పెట్టి స్థలాలు కొన్నామని, తమకు అమ్మిన వారిపై చర్యలు తీసుకోకుండా షెడ్లను, ఇండ్లను ఎందుకు కూల్చివేస్తున్నారని ఫైర్​అయ్యారు. ప్రభుత్వ భూమి అని తెలియక తక్కువ ధరకు వచ్చిందని కొన్నామని, తాము మోసపోయామన్నారు. పెద్ద సంఖ్యలో ఇండ్ల నిర్మాణం జరిగేవరకూ అధికారులు ఎందుకు సైలెంట్‌‌గా ఉన్నారని ప్రశ్నిస్తూ జేసీబీలకు అడ్డుగా నిల్చున్నారు. కొద్దిసేపటికే జేసీబీపై రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. దీంతో జేసీబీ అద్దాలు ధ్వంసం కావడంతోపాటు ఓ పోలీసు గాయపడ్డాడు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుగా నిలిచారు. గతంలో కేసు నమోదైన కబ్జాదారు షేక్ అబిద్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆందోళనకారులు పక్కకు వెళ్లిపోయారు.   

ఈ పాపం గత బీఆర్ఎస్​ సర్కారుదే..
గత బీఆర్ఎస్​సర్కారు హయాంలోనే ఇక్కడ ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పచ్చని చెట్లు, కొండలతో ఉన్న భూమి ఇప్పుడు ఆక్రమణకు గురై కనిపిస్తున్నది. కొంతమంది ​హైడ్రాపై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం పేదల పక్షపాతిగా ఉంటుంది. దొంగపట్టాలతో కబ్జాలు చేసిన వారిపై మాత్రమే హైడ్రా చర్యలు తీసుకుంటుంది. ఏ పేదకైనా ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్తే సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తా .

కూన  శ్రీశైలంగౌడ్​, మాజీ ఎమ్మెల్యే  

నిరుపేదల జోలికి వెళ్లం: హైడ్రా 
తాము నిరుపేదల జోలికి వెళ్లబోమని హైడ్రా స్పష్టం చేసింది. గాజులరామారంలోని ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు కూల్చివేసిన నేపథ్యంలో హైడ్రా అధికారులు మాట్లా డుతూ.. రౌడీల ఆధీనంలో ఉండి అమ్మకానికి సిద్ధంగా ప్రహరీలు నిర్మించిన వాటిని మాత్రమే తొలగించామని స్పష్టం చేశారు. అక్కడ ఉంటున్న పేదల ఇండ్లకు వెళ్లిన హైడ్రా ఇదే విషయాన్ని వారికి వివరించి చెప్పిందన్నారు.  ఇండ్లు నిర్మించి తలుపులు, కిటికీలు ఏర్పాటు చేయని ఇండ్లను కూల్చినట్లు ప్రకటించారు. భూకబ్జాదారులు ఒక గదిని నిర్మించి రూ.5 నుంచి 10 లక్షలకు విక్రయిస్తు న్నట్లు గుర్తించామన్నారు. అలాంటివారిపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.