ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులకు అండగా ఉంటాం : టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం

ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులకు అండగా ఉంటాం : టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం

హైదరాబాద్, వెలుగు: ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులకు అండగా ఉంటామని, రైతుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పుతో భూములు కోల్పోతున్న రైతులు ఆదివారం నాంపల్లిలోని పార్టీ ఆఫీస్ లో కోదండరాంను కలిసి వినతిపత్రం అందచేశారు.

 ట్రిపుల్ ఆర్ కొత్త అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్ వల్ల కార్పొరేట్ కంపెనీలు, భూస్వాములకు లాభం జరుగుతుందని ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్, నారాయణపురం, గట్టుప్పల్, మర్రిగూడ మండలాల రైతులు కోదండరాం దృష్టికి తెచ్చారు. ఈ కొత్త అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్ వల్ల చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతులు తెలిపారు. గతంలో అనేక పోరాటాలలో టీజేఎస్  రైతుల పక్షాన పోరాటం చేసిందని కోదండరాం గుర్తు చేశారు.

 రైతులు తమ భూములకు సంబంధించిన అన్ని విషయాలపై అధ్యయనం చేసి, ఆ భూములు తమకు ఎంత విలువైనవో తెలిపేలా ఒక రిపోర్టును తయారు చేసి తనకు ఇస్తే ప్రభుత్వానికి సమర్పిస్తానని  కోదండరాం చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు  పల్లె వినయ్ కుమార్, ఆశప్ప, భూ నిర్వాసితుల నాయకులు భీమగాని మహేష్ గౌడ్, పల్లె శేఖర్ రెడ్డి, పల్లె పుష్పారెడ్డి, గుండె మల్లేశం, సుర్వి రాజు, నడికుడి అంజయ్యతో పాటు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.