హైదరాబాద్లో జెప్టో, ఇన్స్టా మార్ట్లో ఆర్డర్ చేస్తున్న కస్టమర్లకు అలర్ట్

హైదరాబాద్లో జెప్టో, ఇన్స్టా మార్ట్లో ఆర్డర్ చేస్తున్న కస్టమర్లకు అలర్ట్
  • ఆన్​లైన్ ​గ్రోసరీ డెలివరీ ఆగమాగం! 
  • బల్దియాకు పలు ఫిర్యాదులు 
  • తొందరపాటులో లో క్వాలిటీ, తక్కువ క్వాంటిటీ, ఎక్స్పైరీ ఐటమ్స్​డెలివరీ
  • పోటీ వ్యాపారంలో కస్టమర్లను లాస్​ చేస్తున్న సంస్థలు 
  • డెలివరీ చేసే పాయింట్లపై రైడ్స్కు జీహెచ్ఎంసీ ప్లాన్​ 
  • కమిషనర్ పర్మిషన్​ కోసం వెయిటింగ్

చందానగర్లో ఓ వ్యక్తి ఆన్​లైన్లో ప్రముఖ కంపెనీకి చెందిన జ్యూస్ బాటిళ్లు ఆర్డర్ చేశాడు. అయితే, నిర్వాహకులు ఎక్స్​పైరీ అయిన​ బాటిల్స్ పంపించారు. బాటిల్స్​పై మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్​పైరీ డేట్లను చూడగా, ఈ విషయం బయటపడింది. లేకపోతే, వాటిని తాగి అనారోగ్యం పాలయ్యే వారే. పోటీ సంస్థల కన్నా తొందరగా డెలివరీ చేయాలన్నా అత్యుత్సాహం ఇలాంటి ఘటనలకు కారణమవుతోంది.  

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆన్ లైన్ గ్రోసరీ డెలివరీ సంస్థల తొందరపాటు వినియోగదారుల ఆరోగ్యాన్ని పాడు చేసేలా ఉంది. 15 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని ఒకరు,10 నిమిషాల్లోనే ఇంటికి చేరుస్తామని మరొకరు.. పోటీ వాతావరణంలో వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తొందరపాటులో వస్తువుల నాణ్యతను, ఎక్స్​పైరీ డేట్లను పట్టించుకోకుండా పంపిస్తుండడంతో చాలామంది అలాగే వాడేస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులు కొన్ని బల్దియా దృష్టికి రావడంతో ఆన్​లైన్ గ్రోసరీ, ఫుడ్​డెలివరీ చేసే సంస్థలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఫుడ్​సేఫ్టీ విభాగం అధికారులు డెలివరీ సంస్థలకు సంబంధించిన పాయింట్లపై ఆకస్మిక దాడులు చేసేందుకు ప్లాన్​ సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.

కరోనా నుంచి పెరిగిన డిమాండ్
ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ యాప్స్కు సిటీలో విపరీతమైన డిమాండ్​ఉంది. ఇంట్లోనే కూర్చొని పాల నుంచి మొదలుపెట్టి నిత్యావసర సరుకుల వరకు ఏవైనా తెప్పించుకునే వెసులుబాటు ఉండడంతో సిటీ జనం ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఆఫర్లు కూడా ఇస్తుండడంతో అట్రాక్ట్ ​అవుతున్నారు. షాప్, మాల్​కు వెళ్లి, రావడం టైమ్​వేస్ట్​ వ్యవహారమని జనాలంతా ఆన్​లైన్​ గ్రోసరీ యాప్స్​లోనే ఆర్డర్స్​ ఇస్తున్నారు. ఈ కల్చర్​కరోనా నుంచి  మరింత పెరిగింది. డిమాండ్ పెరుగుతుండడంతో డెలివరీ సంస్థల సంఖ్య కూడా పెరుగుతోంది.

జెప్టో, అమెజాన్​ ఫ్రెష్, ఇన్​స్టా మార్ట్, బ్లింక్ ​ఇట్, బిగ్​ బాస్కెట్ లాంటి సంస్థలు రోజూ వేల డెలివరీలు చేస్తున్నాయి. అయితే, కొన్ని సంస్థలు డెలివరీ చేసే వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. రోజువారి కిరాణ సామగ్రితో పాటు నిత్యావసర వస్తువుల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్పీడ్​డెలివరీ అంటూ ఐటమ్స్ క్వాలిటీ, క్వాంటిటీ, ఎక్స్​పైరీ డేట్లను చూడడం లేదు. కొన్నిసార్లు ఫేక్​ ప్రొడక్ట్స్​కూడా వస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. దీంతో కస్టమర్లు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు.

కమిషనర్ అనుమతి కోసం వెయిటింగ్
ఇప్పటివరకు హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, మార్ట్లపై బల్దియా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే, ఇప్పుడు చాలామంది కస్టమర్ల నుంచి ఆన్​లైన్ ​గ్రోసరీ, ఫుడ్​ డెలివరీ ప్రొడక్ట్స్​పై కంప్లయింట్స్​ వస్తుండడంతో సదరు సంస్థలపై దృష్టిపెట్టారు. పలువురి నుంచి వివరాలు సేకరించిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు డెలివరీ చేసే స్టాక్ పాయింట్లపై దాడులు చేయాలని భావిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఎక్కడైనా కాలం చెల్లిన స్టాక్, నాసిరకం వస్తువులు దొరికితే నోటీసులిచ్చి అవసరమైతే సీజ్ ​చేసేందుకైనా వెనుకాడేది లేదంటున్నారు. కమిషనర్ కర్ణన్ ​అనుమతి కోసం వెయిట్​ చేస్తున్నామని అంటున్నారు.