ఇటలీలో సెటిల్ అవ్వాలనుకుంటే బంపర్ ఆఫర్.. కేవలం రూ.100 కే ఇల్లు !

ఇటలీలో సెటిల్ అవ్వాలనుకుంటే బంపర్ ఆఫర్.. కేవలం రూ.100 కే ఇల్లు !

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. కానీ హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇల్లు కట్టడం అంటే చాలా పెద్ద విషయం. కనీసం కోటి రూపాయలు లేనిది ఇల్లు కట్టాలనుకునే ఆలోచనే వ్యర్థం. అలా ఉన్నాయి రేట్లు. సామాన్యుడు ఇల్లు కట్టి చూస్తాడో లేదో కానీ.. కట్టిన ఇల్లును మాత్రం చూడగలడు.. చూసి మనం కూడా కట్టుకోవాలి.. అనుకోగలడు. అలా ఉంది పరిస్థితి. ఇల్లు అనేది ప్రతి వ్యక్తికి ప్రాథమిక అవసరం. అయితే ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇల్లు అనేది ప్రతి వ్యక్తికి ప్రాథమిక అవసరం. కానీ చాలా మందికి సొంతింటి కల.. కలలాగే మిగిలిపోతూ ఉంటుంది.

అయితే ఇటలీ మాత్రం సొంత ఇల్లు కావాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం ఒక యూరో (ఇటలీ కరెన్సీ) చెల్లిస్తే ఇల్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇండియన్ కరెన్సీలో దాదాపు వంద రూపాయలు. విచిత్రంగా ఉంది కదా. వంద రూపాయలకు ఇల్లు రావడం ఏంటి అనుకుంటున్నారు కదా. ఇల్లు కాదు.. ఇల్లు నమూనా కలర్ జిరాక్స్ కూడా రాదు ఇప్పుడు వంద రూపాయలకు. అలాంటిది ఇంత తక్కువ ధరకు ఇల్లు ఇవ్వడమేంటని ప్రశ్న అందరిలో రావడం కామన్.

ఇటలీ ఇటీవలే 1 యూరో ప్రాజెక్ట్ ను లాంచ్ చేసింది. అక్కడ గతంలో నివాసం ఉండి.. ఖాళీ అయిన గ్రామాలు చాలా ఉన్నాయంట. కొన్ని గ్రామాలు పూర్తిగా ఖాళీ అయ్యాయి.. మరికొన్ని గ్రామాల్లో అక్కడక్కడ కొందరు నివసిస్తున్నారు. యంగర్ పాపులేషన్ (యువత) గ్రామాలను ఖాళీ చేసి పట్టణాల్లో సెటిల్ అయ్యారట. సో.. ఆ గ్రామాల్లో చాలా వరకు వయసు మళ్లిన ప్రజలు మాత్రమే అక్కడక్కడ ఉంటున్నారు. యంగ్ స్టర్స్ ను మళ్లీ గ్రామాల్లో నివసించేలా చేసేందుకు.. ఆ గ్రామాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసిన మొదట్లో అంతగా స్పందన రాలేదు కానీ.. ఇప్పుడు చాలా వరకు యూత్ 1 యూరోకే ఇల్లు దక్కించుకుని నివసిస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది. 

నిజంగా 1 యూరోకే ఇల్లు ఇస్తున్నారా.. ఏదైనా తిరకాసు ఉందా..?

ప్రభుత్వం 1 యూరోకే ఇల్లు ఇవ్వడం నిజం. అయితే చిన్న కండిషన్ ఏంటంటే.. ఆ గ్రామాలలోని ఇండ్లు ఖాళీగా ఉండటం వలన పూర్ కండిషన్ లో ఉన్నాయి. వాటిని రెన్యూవేట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిపేర్ చేయించుకోవడం వలన కొంత ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఇళ్లను సొంత ఖర్చులతో పునరుద్ధరించుకుంటామనే కండిషన్ కు ఒప్పుకుని.. అక్కడ నివసిస్తామని అగ్రిమెంట్ రాస్తేనే ఇల్లు ఇస్తారు. 

అందుకోసం ఒక సంవత్సరంలోపే పునరుద్ధరించి ఇంట్లో ఉంటామని అగ్రిమెంట్ చేసుకోవాలి. 
రిజిస్ట్రేషన్ కు కొంత ఫీజు, ప్రాపర్టీ ట్రాన్ఫర్ కు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 
వర్క్ కంప్లీట్ చేసుకునేందుకు 1000 యూరోస్ నుంచి 5000 యూరోస్ మున్సిపాలిటీ బాండ్ తీసుకోవాలి. వర్క్ కంప్లీట్ అయిన వెంటనే ఆ డబ్బు తిరిగి ఇస్తారు.

విదేశీయులు కొనుకోవచ్చా..?

ఫారెనర్స్ కూడా ఈ ఒక యూరో ఇల్లును కొనుకోవచ్చు. దీనికోసం కొన్ని అదనపు కండిషన్స్ ఉన్నాయి. కొనే వాళ్లకు చెందిన దేశంతో ఇటలీ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ కండిషన్ ఏంటంటే.. ఇటలీ పౌరులు ఎవరైనా మీ దేశంలో ఇల్లు కొనే సదుపాయం మీ దేశంలో ఉంటే.. మీరు ఇటలీలో ఇల్లు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇటలీ ట్యాక్స్ కోడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా చట్టపరమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.