
బీసీసీఐ ప్రపంచంలోనే అతిపెద్ద.. అత్యంత ధనికి క్రికెట్ బోర్డు. స్వాతంత్ర్యానికి పూర్వం 1928 లో ఏర్పడిన బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (BCCI).. ఇప్పటి వరకు ఇండిపెండెంట్ బాడీగా.. అటానమస్ (స్వయం ప్రతిపత్తి) హోదా అనుభవిస్తూ వస్తోంది. అంటే ప్రభుత్వ జోక్యం లేకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం.. స్వయంగా పరిపాలించుకోవడం ఈ సంస్థకు ఉన్న ప్రత్యేక ప్రివిలెజ్. అయితే బీసీసీఐని జాతీయ క్రీడా బిల్లు కిందికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు క్రీడాశాఖ విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.
ఇప్పటి వరకు BCCI ఫండింగ్ విషయంలో ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వీయ నిర్వహణలో ఉంది. అయితే 2028 లో లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో పాల్గొనాలంటే నేషనల్ స్పోర్ట్స్ బిల్ కిందికి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అందుకు సంబంధించి డ్రాఫ్ట్ బిల్లు సిద్ధమైందని.. మంగళవారం (జులై 22) కేంద్ర యువజన, క్రీడా శాఖ ప్రకటించింది. స్పోర్ట్స్ బిల్లు అమలులోకి రానున్న తరుణంలో బీసీసీఐ.. నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ గా క్రీడాశాఖ పరిధిలోకి రానుంది.
2019 వరకు BCCI ని స్పోర్ట్స్ ఫెడరేషన్ (NSF) గా గుర్తించలేదు. అయితే 2020లో సమాచార హక్కు చట్టం (RTI) పరిధిలోకి తీసుకొచ్చారు. కొత్త బిల్లు ప్రకారం.. ఆటోమేటికల్ గా NSF గా పరిగణించడంతో పాటు.. జాతీయ క్రీడా శాఖ అండర్ లోకి బీసీసీఐ వస్తుంది. దీని వలన క్రీడా శాఖ నియమ నిబంధనలు బీసీసీఐ కి అమలవుతాయి. గతంలో లోధా కమిటీ ఇచ్చిన ఏజ్ లిమిట్ తదితర సూచనలు అమలు అవుతాయి.
నేషనల్ స్పోర్ట్స్ బిల్లు గురించి:
నేషనల్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ.. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ - 2025 డ్రాఫ్ట్ ను విడుదల చేసింది. జాతీయ స్పోర్ట్స్ ఫెడరేషన్స్, ఇతర సంస్థల పనితీరు మార్చడంతో పాటు బిల్లు అండర్ లోకి తీసుకొచ్చేందుకు ఈ బిల్లు ఉద్దేశించింది. క్రీడల్లో అన్ని సంస్థల్లో పారదర్శకత (ట్రాన్స్పరెన్సీ) తెచ్చేందుకు, క్రీడాకారుల కేంద్రంగా సంస్కరణలు తీసుకురావడం, ప్రపంచ క్రీడా వేదికపై ఉత్తమ విధానాలు అమలు చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు.
ఎన్నో ఏళ్లుగా ఈ డ్రాఫ్ట్ బిల్లు తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పటికీ వీలు కాలేదు. నైతిక విలువలు, క్రీడాకారుల హక్కులు కాపాడటం, వివాద రహిత వాతావరణం ఏర్పాటు చేసేందుకు క్రీడా బిల్లు తీసుకురావాలని చాలా ప్రభుత్వాలు ప్రయత్నించాయి. కానీ కుదరలేదు. ప్రస్తుత బిల్లుతో ఒలింపిక్, ప్యారాఒలింపిక్ నిబంధనలకు అనుకూలంగా గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయనున్నారు. దీనివలన అంతర్జాతీయ ఈవెంట్స్ చేయడానికి వీలు కలుగుతుంది. 2036 ఒలింపిక్ నిర్వహణకు కూడా ఉపకరిస్తుంది.
►ALSO READ | Two Tier WTC: ఐసీసీ రెండంచెల టెస్టు ఫార్మాట్.. డివిజన్ 2లో పాకిస్థాన్, వెస్టిండీస్
ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం. క్రీడాకారుల ఆధారంగా పాలసీ రూపొందించడం దేశంలో ఇదే మొదటిసారి. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, ప్యారా ఒలింపిక్ కమిటీలతో పాటు అన్ని స్పోర్ట్స్ ఫెడరేషన్లు (NSF) అథ్లెటిక్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కీలక నిర్ణాయక విధానాలలో ఈ కమిటీలు క్రీడాకారులను నియమిస్తాయి.
అన్ని స్పోర్ట్స్ బాడీస్ నుంచి మంచి మెరిట్ ఉన్న క్రీడాకారులు ఇద్దరు చొప్పున ఎక్స్ క్లూజివ్ కమిటీలలో ఉంటారు. అలాగే మహిళల ప్రాతినిథ్యం కోసం ప్రతి కమిటీలో నలుగురు మహిళా క్రీడాకారులు ఉంటారు. చట్టపరమైన వివాదాలు, క్రీడాకారులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి సులువైన మార్గం వేసినట్లవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
బీసీసీఐ వంటి సంస్థలపై ఎలాంటి ప్రభావం పడుతుంది..?
స్పోర్ట్స్ బిల్లు అమలులోకి వచ్చి నతర్వాత BCCI లాంటి సంస్థలు స్వయం ప్రతిపత్తిని కోల్పోతాయి. రెగ్యులేటరీ బాడీలుగా ఉన్న సంస్థలు అన్నీ నేషనల్ స్పోర్ట్స్ బోర్డు (NSB) కిందికి వస్తాయి. స్పోర్ట్స్ ఫెడరేషన్లను కంప్లైంట్ల ఆధారంగా లేదా విచారణ ఆధారంగా సస్పెండ్ చేసే అధికారం NSB కి ఉంటుంది. NSB బాడీని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. క్రీడల కమిటీ ఎన్నికల నుంచి మొదలుకొని ఆర్థిక పరమైన అవకతవకల వరకు అన్ని ఫెడరేషన్లపై చర్యలు తీసుకునే అధికారం NSB కి ఉంటుంది. అంటే అది అన్నింటికంటే శక్తివంతమైన సంస్థగా పనిచేస్తుంది.