సెప్టెంబర్ 28న బీసీసీఐ ఏజీఎం..కొత్త బాస్ ఎన్నిక

సెప్టెంబర్ 28న బీసీసీఐ ఏజీఎం..కొత్త బాస్ ఎన్నిక

ముంబై:  బీసీసీఐలో మార్పులకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత ప్రెసిడెంట్, 1983 వరల్డ్ కప్ హీరో రోజర్ బిన్నీ పదవీకాలం ముగియడంతో  కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి సెప్టెంబర్ 28న ముంబైలో వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహించనున్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏ అధికారి అయినా 70 ఏండ్ల వయసు దాటిన తర్వాత పదవిలో కొనసాగడానికి అనర్హులు. 

జులైలో బిన్నీ 70వ పడిలోకి అడుగుపెట్టడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. బోర్డు ప్రెసిడెంట్‌‌‌‌ పోస్టుతో పాటు ఐపీఎల్ చైర్మన్ పదవికి కూడా ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత చైర్మన్ అరుణ్ ధుమాల్ తన ఆరేండ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకొని, తప్పనిసరి కూలింగ్-ఆఫ్ పీరియడ్‌‌‌‌కు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా, ఇతర కీలక అధికారులు తమ పదవుల్లో కొనసాగనున్నారు. కాగా, ఏజీఎంలో బోర్డు అంబుడ్స్‌‌‌‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ నియామకాలతో పాటు, ఐసీసీలో బీసీసీఐ ప్రతినిధిని కూడా ఎన్నుకోనున్నారు.