Pawan Kalyan : 'హరిహర వీరమల్లు' పవన్ పారితోషికం ఇంతేనా.. 'బ్రో' కన్నా తగ్గిందా?

Pawan Kalyan : 'హరిహర వీరమల్లు' పవన్ పారితోషికం ఇంతేనా..  'బ్రో' కన్నా తగ్గిందా?

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం 'హరిహర వీరమల్లు' .  ఈ మూవీ జూలై 24, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. క్రిష్ జాగర్లమూడి, ఎఎం జ్యోతి కృష్ణ దర్శకత్వంలో  పిరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కింది.  నిర్మాణంలో ఎదురైన అనేక సవాళ్ల వల్ల ఆలస్యమైనప్పటికీ, ఇప్పుడు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఓపెనింగ్స్ రికార్డు సృష్టిస్తాయని సినీ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ పారితోషికం.. 'బ్రో' కన్నా తగ్గిందా?
పవన్ కళ్యాణ్ కేవలం ఒక నటుడిగానే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన రాజకీయ స్థానంతో సినిమాపై అదనపు హైప్‌ను సృష్టించారు. 'బ్రో' సినిమా తర్వాత రెండు సంవత్సరాల విరామం అనంతరం ఆయన మళ్ళీ వెండితెరపైకి వస్తున్నారు. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 'హరిహర వీరమల్లు' చిత్రానికి పవన్ కళ్యాణ్ రూ. 15 కోట్లు మాత్రమే పారితోషికంగా తీసుకున్నారని తెలుస్తోంది. ఇది ఆయన గత చిత్రం 'బ్రో'కు తీసుకున్న భారీ మొత్తం రూ. 50 కోట్ల కన్నా గణనీయంగా తక్కువ. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా మారిన తర్వాత తన సమయాన్ని, ప్రాధాన్యతలను రాజకీయ బాధ్యతలకు కేటాయించడం వల్లనే పారితోషికం తగ్గించుకున్నారా అనే చర్చ సినీ వర్గాల్లో నడుస్తోంది. ఇది ఆయన రాజకీయ నిబద్ధతకు నిదర్శనంగా కూడా పలువురు భావిస్తున్నారు.

నిర్మాత కోసం రెమ్యునరేషన్ త్యాగం?

మరో వైపు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు కావాలనే తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారని సినీ వర్గాలు అభిప్రాయవ్యక్తం చేస్తాయి. ఇప్పటికే అనేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆదుకునేందుకు తన పారితోషికం తగ్గించుకోని ఉండొచ్చని భావిస్తున్నారు.  ఈ సినిమా కోసం నిర్మాత ఎ.ఎం. రత్నం ( AM Ratnam ) పడిన తపనన అంతా ఇంతా కాదని పవన్ కళ్యాణ్ అన్నారు.  మూవీ షూటింగ్ ప్రారంభం  చేసినప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఒక దశలో ఈ సినిమా నిలిచిపోతుందా.. అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. కానీ చివరికి పూర్తి చేశాం.  ఒకప్పుడు రత్నం గారి కోసం డిస్ట్రిబ్యూటర్లు తిరిగేవారని, అలాంటి నిర్మాత ఆర్థిక ఇబ్బందులు పడటం తనకు చాలా బాధ కలిగించిందని అన్నారు. డబ్బు గురించి కాదు, సినిమా సక్సెస్ గురించి కాదు, ఇండస్ట్రీ కోసం నిలబడటం ముఖ్యం అని పవన్ స్పష్టం చేశారు. "ఖుషి సినిమా తీస్తున్నప్పుడు రత్నం గారు ఎంతో ఫ్రీడం ఇచ్చారు. అలాంటి ఆయన ఇప్పుడు నలిగిపోతుంటే చాలా బాధ వేసింది అని పవన్ వివరించారు.  సో దీనిని బట్టి చూస్తే నిర్మాత కోసమే పవన్ తన రెమ్యునరేషన్ త్యాగం చేశారని అభిమానులు, సినీ వర్గాలు భావిస్తున్నాయి.. 

విలన్, హీరోయిన్ల భారీ పారితోషికాలు
'హరిహర వీరమల్లు' చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకమైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ 'దాకు మహారాజ్' తర్వాత తెలుగులో బాబీకి ఇది రెండో సినిమా. ఈ పవర్‌ఫుల్ పాత్రకు గాను 'ది సోల్జర్' నటుడు రూ3 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ఆయన నటన సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు.  పవన్ కూడా ఎంతో అద్భుతంగా చేశారని కితాబు ఇచ్చారు.

 

పవన్ కళ్యాణ్ సరసన కథానాయికగా నిధి అగర్వాల్ పంచమి పాత్రలో నటిస్తున్నారు. ఆమె ఈ సినిమాకు రూ.2.5 కోట్లు పారితోషికంగా తీసుకున్నారని టాక్. మరోవైపు, బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రి మొఘల్ యువరాణి, ఔరంగజేబు సోదరి అయిన రోషనారా పాత్రను పోషిస్తున్నారు. ఆమెకు ఈ రెండు భాగాల పిరియాడికల్ యాక్షన్ సినిమాలో రూ.3 కోట్లు పారితోషికం చెల్లిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా, నృత్య తార నోరా ఫతేహి కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.  ఈ ముద్దుగుమ్మ కూడా బాగానే తీసుకున్నట్లు సమాచారం.  మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టించనుందో చూడాలి .