ఎయిర్ ఇండియా విమానంలో మంటలు : ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం

ఎయిర్ ఇండియా విమానంలో మంటలు : ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఫ్లయిట్.. ఈ మాట వింటే చాలు అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన గుర్తుకొస్తుంది. అంతే కాదు ఇటీవల వరసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు సైతం భయాన్ని పుట్టిస్తున్నాయి. ఇలాంటి టైంలో.. 2025, జూలై 22వ తేదీ సాయంత్రం ఢిల్లీ ఎయిర్ పోర్టులో జరిగిన ఘటన అందర్నీ భయాందోళనలకు గురి చేసింది. పరుగులు పెట్టించింది. జస్ట్ మిస్.. లేకపోతే బీభత్సం జరిగేది.. మరో అహ్మదాబాద్ ఘటన జరిగేది అంటున్నారు. ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏఐ 317 నెంబర్ ఎయిర్ ఇండియా విమానం హాంగ్ కాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చింది. సాయంత్రం 6 గంటల సమయంలో ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానంలో ప్యాసింజర్లు కిందకు దిగారు. ఆ తర్వాత విమాన సిబ్బంది కూడా బయటకు వచ్చారు. ప్యాసింజర్లు, సిబ్బంది అలా విమానం ఖాళీ చేసి బయటకు వచ్చారో లేదో.. విమానంలో మంటలు చెలరేగాయి. 

విమానంలోని పవర్ బాక్సులు, పవర్ సప్లయ్ ఉండే భాగం నుంచి మంటలు వచ్చాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ, భద్రతా అధికారులు.. వెంటనే విమానంలోని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల కారణంగా విమానం కొంత భాగం డ్యామేజ్ అయ్యింది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించింది. ప్రయాణికులు, సిబ్బంది అంతాసురక్షితంగా ఉన్నారని తెలిపింది. విమానంలోని ఆక్సిలరీ పవర్ యూనిట్ (APU)లో మంటలు చెలరేగినట్లు గుర్తిచామంది ఎయిర్ ఇండియా.

 మంటలు చెలరేగడానికి కారణమేంటన్న దానిపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది. 2025, జూన్ 12న అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో దాదాపు 260 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన దేశపౌరులు పూర్తిగా మరువకముందే మరోసారి ఎయిర్ ఇండియా విమానంలో ప్రమాదం జరగడం ప్రయాణికుల్లో భయాందోళన రేకెత్తిస్తోంది. మొత్తానికి ఈ ఘటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకపోవడంతో ప్రయాణికులు, అధికారులు, ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ ఊపిరి పీల్చుకున్నారు.