Pawan Kalyan: 'హరి హర వీరమల్లు'కు పారితోషికం తీసుకోలేదు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!

Pawan Kalyan: 'హరి హర వీరమల్లు'కు పారితోషికం తీసుకోలేదు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరి హర వీరమల్లు' జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు కేవలం కొన్ని రోజులే మిగిలి ఉండటంతో, చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రెస్ మీట్‌లు, ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత, రాజకీయ అంశాలపై కూడా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

'వీరమల్లు' ప్రయాణం, దర్శకుడి కృషి 
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 'హరి హర వీరమల్లు' చిత్రం దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ కాలం పాటు నిర్మాణంలో ఉందని తెలిపారు. ఈ జాప్యానికి గల కారణాలు ఒక వైపు రాజకీయంగా బిజీగా ఉండటం కూడా ఒక కారణం కాగా,  ఇది ఒక భారీ చారిత్రక నేపథ్యమున్న చిత్రం కావడంతో, సెట్లు, విజువల్స్, నటీనటుల డేట్స్ వంటి అనేక అంశాలు దీనికి కారణమయ్యాయని పేర్కొన్నారు. దర్శకులు క్రిష్ జాగర్లమూడి కథను నమ్మి, ఎంతో కష్టపడి పనిచేశారని తెలిపారు.  ఆతర్వాత ఏఎం జ్యోతికృష్ణ ఎంతో భాగా చిత్రాన్ని తెరపైకి ఎక్కించారని కొనియాడారు.  ప్రతి సన్నివేశాన్ని గొప్పగా తెరకెకెక్కించడానికి కృషి చేశారని ప్రశంసించారు. ఆయనతో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఒక కొత్త అనుభూతినే ఇస్తుందని తెలిపారు.

చారిత్రక నేపథ్యం - సందేశం.. పార్ట్ 2 ఎప్పుడంటే?
'హరి హర వీరమల్లు' కేవలం ఒక యాక్షన్ చిత్రం మాత్రమే కాదని, 17వ శతాబ్దపు మొఘల్ కాలం నాటి సామాజిక, రాజకీయ పరిస్థితులను ప్రతిబింబిస్తుందని పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ సినిమాలో వినోదంతో పాటు ఒక బలమైన సందేశం కూడా ఉందని, నిరంకుశ పాలన, అన్యాయాలపై పోరాటం వంటి అంశాలు నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమని అన్నారు. 'ధర్మం కోసం నిలిచిన వీరుడి కథ' ఇది అని, ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లిపోయిన కోహినూర్‌ వజ్రాన్ని తీసుకొచ్చే వీరుడి కథ. అని తెలిపారు.  రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ ‘పార్ట్‌-2’ను వచ్చే డబ్బులు, తనకున్న సమయాన్ని బట్టి చేస్తామని చెప్పారు. అందుకు భగవంతుడి ఆశీస్సులు కూడా కావాలని సమాధానమిచ్చారు. ఇప్పటికే 20 నుంచి 30 శాతం షూటింగ్ పూర్తయిందని చెప్పారు.

►ALSO READ | Pawan Kalyan: హరి హర వీరమల్లు' టికెట్ల కోసం భారీ హడావుడి.. ఏపీలో రూ.1000 దాటిన ధరలు!

సినిమాలు - రాజకీయం
రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా సినిమాలు చేస్తున్నారని ప్రశ్నించినప్పుడు, పవన్ కళ్యాణ్ తన సినిమాల పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేశారు. 'హరి హర వీరమల్లు'తో పాటు తాను ఒప్పుకున్న 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి చిత్రాలను కూడా పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. ఒక నటుడిగా తనకు ప్రేక్షకులను అలరించడం ముఖ్యమని, అలాగే ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేయడం తన బాధ్యత అని పేర్కొన్నారు. రెండు పాత్రల మధ్య సమన్వయం సాధించడానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి మంచిదే అని అన్నారు. గత సినిమాలకు ఇస్తున్నట్లు తన సినిమాకు ఇచ్చారని తెలిపారు.

సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. 
ఈ చిత్రం షూటింగ్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని పవన్ అన్నారు.. రెండు సార్లు కరోనా కష్టాలు, ఆ తర్వాత ఏపీలో రాజకీయ డిజాస్టర్‌ వల్ల నేను సినిమాలపై దృష్టి పెట్టలేకపోయాను.  దీంతో నా నిర్మాతలు ఇబ్బంది పడ్డారు. దానికి నైతిక బాధ్యత వహించి ఈ సినిమాకు ప్రమోషన్‌ చేస్తున్నానని తెలిపారు.  నిర్మాత ఎఎం రత్నం లాంటి వ్యక్తి ఇబ్బందులు పడకూడన్న ఉద్దేశంతోనే  తాను సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు వచ్చానని తెలిపారు.   డబ్బు అవసరమే.. కానీ డబ్బే ప్రాధాన్యం‌ కాదన్నారు. తాను నటించిన హరిహరవీరమల్లు సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోలేదని చెప్పారు.  ‘భీమ్లానాయక్‌’కు టికెట్‌ ధరలు తగ్గించినప్పుడు నేను, నిర్మాత ఇద్దరం నష్టపోయాం.   తర్వాత ‘జానీ’ చేస్తే ఆడలేదు. ఫైనాన్షియర్లు అందరూ నా ఇంటికి వచ్చారు. నా పారితోషికం తిరిగి ఇచ్చేశా. ఆ మూవీ నాకు రాజకీయాల్లో బాగా ఉపయోగపడింది. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు బలంగా నిలబడ్డానని చెప్పుకొచ్చారు.

కూటమి ఎమ్మెల్యేతో కలిసి సినిమా చూస్తా..
చివరగా, 'హరి హర వీరమల్లు' చిత్రం ఒక గొప్ప విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని, అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమాను చూసి ఆదరించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. టికెట్ ధరల పెంపు వంటి అంశాలపై కూడా ప్రభుత్వ అనుమతులు వచ్చాయని, సినిమాను ఆదరించడానికి ఇది అడ్డంకి కాదని ఆశాభావం వ్యక్తం చేశారు.   తమ కూటమి ఎమ్మెల్యేలు కోరితే.. వారితో కలిసి సినిమా చూస్తామని పవన్ చెప్పారు.  బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.