
పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అభిమానులకు, సినీ ప్రియులకు బాక్సాఫీస్ వద్ద మరోసారి సందడి చేసే సమయం ఆసన్నమైంది. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరి హర వీరమల్లు' ( Hari Hara Veera Mallu ) జులై 24న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. మంగళవారం (జులై 22, 2025) నుంచి టికెట్ బుకింగ్స్ ప్రారంభం కావడంతో అభిమానుల హడావుడి మరింత పెరిగింది.
బుకింగ్స్ ప్రారంభం, ధరల పెంపు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో 'బుక్ మై షో', 'డిస్ట్రిక్ట్' వంటి ఆన్‌లైన్ టికెటింగ్ వేదికలపై బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. బుకింగ్స్ మొదలైన కొద్ది సేపటికే ప్రీమియం సీట్లు సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో, కొన్ని ప్రాంతాల్లో ధరలు రూ.1000కి పైగా చేరాయి. ఎంపిక చేసిన సింగిల్ స్క్రీన్ , మల్టీప్లెక్స్ లలో ఈ షోను ప్రదర్శిస్తున్నారు. రెక్లయినర్, సోఫా సదుపాయం ఉన్న టికెట్ ధర రూ, 1000 దాటగా, బాల్కనీ ధర రూ. 800 , సెకండ్ క్లాస్ రూ. 790 ( బుకింగ్ చార్జీలు అదనం )లకు లభిస్తున్నాయి. జూలై 24 నుంచి మల్టీప్లెక్స్ లలో పెంచిన ధరలకు అనుగుణంగా రాయల్ సీటింగ్ లో రూ. 495, ఎగ్జిక్యూటివ్ రూ. 377 ధర చూపిస్తోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో బాల్కనీ రూ. 250, ఫస్ట్ క్లాస్ రూ. 150గా ( బుకింగ్ ఛార్జీలు అదనం) నిర్ణయించారు.
తెలంగాణంలో హరి హర వీరమల్లు టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే పెయిడ్ ప్రీమియర్ కు సంబంధించి ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు. సాధారణంగా రూ.100,-200 ఉండే టికెట్లు, పెంపు తర్వాత భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ సీటింగ్ టికెట్ల ధరలు రూ.413 (బుకింగ్ ఛార్జీలు అదనం) వరకు ఉన్నట్లు తెలుస్తోంది. సింగిల్ స్క్రీన్లలో బాల్కనీ టికెట్లు రూ.300, ఫ్రంట్ సర్కిల్ రూ.200కు అమ్ముడవుతున్నాయి. ప్రభుత్వం మొదటి 10 రోజులు మాత్రమే రేట్లు పెంచడానికి పర్మిషన్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై లోయర్ క్లాస్‌కు రూ.100, అప్పర్ క్లాస్‌కు రూ.150 పెంచుకునే వెసులుబాటు కల్పించారు. 10 రోజుల తర్వాత సాధారణ టికెట్ ధరలతోనే సినిమా టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది.
భారీ అంచనాలు, సంచలన బుకింగ్స్
'హరి హర వీరమల్లు' భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకోనున్న ఈ సినిమా, విడుదలకాకముందే టికెట్ బుకింగ్స్ రూపంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాను నిర్మాత ఏఎం రత్నం నిర్మించగా, క్రిష్ జాగర్లమూడి , ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్, నోరా ఫతేహి, బాబీ డియోల్ వంటి తారలు కీలక పాత్రలు పోషించారు. సినిమాలోని విజువల్స్, పవన్ కళ్యాణ్ నటన, , కథనంపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. టికెట్లు బుక్ చేసుకోవడానికి అభిమానులు పోటీ పడుతున్నారు.