ధన్‎ఖడ్‎కు ఏం కాలే.. ఆయన హెల్తీగా ఉన్నరు: రాజీనామాపై దీదీ సంచలన వ్యాఖ్యలు

ధన్‎ఖడ్‎కు ఏం కాలే.. ఆయన హెల్తీగా ఉన్నరు: రాజీనామాపై దీదీ సంచలన వ్యాఖ్యలు

కోల్‎కతా: భారత మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‎ఖడ్ రాజీనామా వ్యవహారం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అనారోగ్య కారణాలు చూపుతూ ఆల్ ఆఫ్​సడెన్‎గా ఆయన పదవికి రాజీనామా చేయడం.. 24 గంటలు కూడా గడవకముందే ధన్‎ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలపడం అనేక సందేహాలకు తావిస్తోంది. ధన్‎ఖడ్ ఆకస్మిక రాజీనామాకు అనారోగ్యం కారణం కాదని.. అసలు రీజన్ వేరే ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

 ఈ క్రమంలో తన విరోధి జగదీప్ ధన్‎ఖడ్ రాజీనామాపై టీఎంసీ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగదీప్ ధన్‌ఖడ్ ఆరోగ్యకరమైన వ్యక్తి అని.. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నారని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఆయన రాజీనామాకు అనారోగ్యం కారణం కాకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు దీదీ.

‘‘జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా గురించి నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేదు. ఏమి జరుగుతుందో చూద్దాం. కానీ జగదీప్ ధన్‌ఖడ్ ఆరోగ్యకరమైన వ్యక్తి. ఆయన ఆరోగ్యం పూర్తిగా బాగుందని నేను భావిస్తున్నాను” అని పేర్కొన్నారు. పరోక్షంగా జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాకు అనారోగ్యం కాదన్నారు దీదీ.

►ALSO READ | ఎయిర్ ఇండియా విమానంలో మంటలు : ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం

 కాగా, 2019 నుంచి 2022 వరకు జగదీప్ ధన్‌ఖడ్ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో జగదీప్ ధన్‎ఖడ్ వర్సెస్ మమతా బెనర్జీ అన్నట్లు పరిస్థితులు ఉండేవి. అసెంబ్లీ, రాజ్ భవన్ మధ్య గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండేది సిట్యూయేషన్. గవర్నర్ ధన్ ఖడ్, సీఎం మమతా బెనర్జీ బహిరంగంగానే మాటల తుటాలు పేల్చుకునేవారు. 

కాగా, భారత ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ 2025, జూలై 21న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రిజైన్ లెటర్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఈ క్రమంలో 2025, జూలై 22న జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. 24 గంటల వ్యవధిలోనే రాజీనామా, రాజీనామాకు ఆమోదం తెలపడం అన్ని చకచకా అయిపోయాయి.