- భారత్ తరఫున కేంద్రమంత్రి ఎస్. జైశంకర్ హాజరు
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియలను బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. అంతకుముందు ఖలీదా జియా శవపేటికను ఆమె నివాసం నుంచి అంత్యక్రియలు జరిపే మానిక్ మియా అవెన్యూకు కాన్వాయ్ లో తీసుకొచ్చారు. పార్లమెంటు భవనం సమీపంలో భారీ బందోబస్తు మధ్య ఆమె భర్త సమాధి పక్కన ఖననం చేశారు. వేలాదిమంది ప్రజలు ఆమెకు భావోద్వేగపూరితంగా కన్నీటి వీడ్కోలు పలికారు.
అంత్యక్రియలకు పలువురు నేతలు, అధికారులు
ఖలీదా జియా అంత్యక్రియలకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్, పాకిస్తాన్, నేపాల్, ఇతర పొరుగు దేశాలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, దౌత్యవేత్తలు, హైకమిషనర్లు, పలు అంతర్జాతీయ సంస్థల అధినేతలు, బంగ్లాదేశ్ టాప్ రాజకీయ నేతలు, సైనిక అధికారులు హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన ప్రార్థనల్లో ఖలీదా జియా కుమారుడు, బీఎన్ పీ తాత్కాలిక చైర్మన్ తారిఖ్ రెహమాన్, బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక చీఫ్ మహమ్మద్ యూనస్, చీఫ్ జస్టిస్ జుబాయర్ రెహమాన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
బైతుల్ మోకర్రం జాతీయ మసీదు ప్రధాన మతాధికారి మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ ఈ ప్రార్థనలకు నాయకత్వం వహించారు. గత కొన్నేండ్లుగా లివర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో పాటు బీపీ, షుగర్ తో ఖలీదా బాధపడుతున్నారు. నవంబర్ 23న ఆస్పత్రిలో అడ్మిట్ అయిన ఆమె అప్పటి నుంచి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
